నేడు కోవింద్‌తో టీఆర్‌ఎస్ నేతల భేటీ
- ఘన స్వాగతానికి బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు
- జలవిహార్‌కు తరలి రావాలని పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశం
- 11.15 గంటల నుంచి 12 గంటల వరకు వైఎస్సార్‌సీపీ ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార టీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి కావడంతో టీఆర్‌ఎస్ నేతలు ఆయన పర్యట నకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మంగళ వారం కోవింద్ ప్రచారంకోసం హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలకాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కోవింద్‌తో జరిగే సమావేశా నికి తప్పక హాజరుకావాలని, ఉదయం 11 గంటల లోపే జలవిహార్‌కు చేరుకోవాలని పార్టీ ప్రజా ప్రతినిధులకు సూచించారు. పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయ ర్లు, జెడ్పీ చైర్‌పర్సన్లను ఈ సమావేశానికి ఆహ్వా నించారు.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమా నంలో బయలుదేరి కోవింద్ ఉదయం 9.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుం టారు. ఈ సందర్భంగా కోవింద్‌కు మంత్రులు, ఎంపీల బృందం బేగంపేట విమానాశ్రయం లోనే ఘనస్వాగతం పలుకుతుంది. ఉప ముఖ్య మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు టి.హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, పార్ల మెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, లోక్ సభ పక్ష నేత జితేందర్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఈ బాధ్యత అప్పజెప్పారు. కాగా, మధ్యాహ్నం 12.15 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి కోవింద్ హాజరవుతారు. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర పార్టీ నాయకులు ఘన స్వాగతం పలుకుతారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఆహ్వానితులకు కోవింద్‌ను సీఎం కేసీఆర్ పరిచయం చేస్తారు. అక్కడే కోవింద్‌కు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరే సమయంలో కూడా కోవింద్‌కు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు వీడ్కోలు పలుకుతారు.
ఇదీ షెడ్యూలు
మంగళవారం ఉదయం 7.30 గంటలకు కోవింద్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి ఉదయం 9.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బేగంపేటలోని హరిత టూరిజం ప్లాజాకు చేరుకుని 10 గంటల నుంచి 10.30 గంటలవరకు బీజేపీ ఎమ్మెల్యేలతో, తర్వాత 10.45 వరకు టీడీపీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. అనంతరం పార్క్ హయత్ హోటల్‌కు చేరుకుని 11.15 గంటల నుంచి 12 గంటల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. అక్కడి నుంచి జలవిహార్‌కు చేరుకుని 12.15 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు టీఆర్‌ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. ఒంటి గంట నుంచి 1.45 గంటల వరకు సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలసి మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం 2గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు బయలుదేరి వెళతారు. ఏపీ బీజేపీ, టీడీపీలకు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. అనంతరం 5.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమవుతారు.