రాష్ట్రపతి పదవి అత్యంత పవిత్రమైంది: కోవింద్
హైదరాబాద్ : తనకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలకు, నేతలకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం జలవిహార్‌లో టీఆర్‌ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ...‘గవర్నర్‌గా నేను పార్టీలతకు అతీతంగా పని చేశాను. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా దేశం అభివృద్ధి చెందాలి. అదే నా లక్ష్యం. యువత ఆకాంక్షను నెరవేర్చేందుకు, ఆధునిక విద్య అందించేందుకు కృషి చేస్తా. రాష్ట్రపతి పదవి అత్యంత పవిత్రమైంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది.
నేను ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీతో అనుబంధంగా లేను. నా అభ్యర్థిత్వానికి మద్దతు తెలపాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి. ఇక నన్ను స్వాగతిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరమంతా కటౌట్లు పెట్టించారు. హిందీలో ప్రసంగించారు. అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్రపతిగా పనిచేసిన జకీర్ హుస్సేన్ హైదరాబాదీ. నీలం సంజీవరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు.’ అని అన్నారు.