న్యూఢిల్లీ: ప్రతిపక్షాల పక్షాన రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దళిత మహిళ మీరా కుమార్ రాష్ట్రపతి భవన్‌లోకి అడుగుపెట్టలేక పోవచ్చు. బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే కూటమి నిలబెట్టిన దళిత విద్యావేత్త రామ్‌నాథ్ కోవింద్‌కు ఎక్కువ శాతం ఓట్లు ఉండడమే అందుకు కారణం. కానీ 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతిపక్షాలన్నీ నేటిలాగే ఏకమై మీరా కుమారినే ప్రధాన మంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడది అసంబద్ధంగాను, అర్థరహితంగాను, నైరూప్య చిత్రంగాను అనిపించవచ్చు.
ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో మీరా కుమార్‌కు మద్దతుగా కాంగ్రెస్ నాయకత్వంలో 17 పార్టీలు ముందుకు వచ్చాయి. ప్రతపక్షం తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని ఆది నుంచి కాంగ్రెస్ వెంటబడిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాలకపక్షంవైపు మొగ్గుచూపారు. ముందుగానే మీరా కుమార్ పేరును ప్రతిపాదించి ఉన్నట్లయితే నితీష్ కుమార్ ప్రతిపక్షం వెంట వచ్చేవారే. తొందరపడి ఆయన బీహార్ గవర్నర్‌గా ఉన్న వ్యక్తి, అందులోనూ దళితుడన్న భావంతో కోవింద్‌కు మద్దతు ప్రకటించారు. ఆయన నిర్ణయాన్ని మార్చుకునే రకం కాదుకనుక ఆయన తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు.
పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వద్ధి రేటు 7.8 నుంచి 6.1 శాతానికి పడిపోవడం, గోవధ నిషేధం తదితర పరిణామాలు పాలకపక్షానికి దళితులను, ముస్లింలను దూరం చేశాయి. ఈ రెండు వర్గాలే కలసి ఉత్తరప్రదేశ్ జనాభాలో 34 శాతం మంది ఉన్నారు. యూపీలో దళితులంతా ఒక్క మాయావతి వెనకాలే కాకుండా వివిధ గ్రూపుల కింద ఏకమవుతున్నారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతిచ్చిన మహారాష్ట్రకు చెందిన మహర్లు గోవధ నిషేధం కారణంగా బౌద్ధ మతంలోకి మారిపోయారు.
జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ పన్నుకు వ్యతిరేకంగా గుజరాతీలోని మార్వీడీలు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరంతా ఇంతకాలం మోదీకి హారతులు పట్టిన వారే. కానీ జీఎస్టీ తమ తరతరాలుగా సంప్రదాయంగా వస్తున్న వ్యాపారాన్ని దెబ్బతీస్తుందన్నది వారి ఆందోళన.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఐక్యతా రాగం వినిపించడం ద్వారా 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష కూటమి ఎన్డీయేను మట్టి కరిపించాలన్నది కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాల వ్యూహం. ఈ వ్యూహం నెరవేరాలంటే మోదీ లాంటి నాయకుడిని ఢీకొనే సమర్థుడైన నాయకత్వం కావాలి. నితీష్ కుమార్ ప్రత్యామ్నాయ నాయకుడిగా తాను ప్రతిపక్షంలో ఎదగాలన్న ఆలోచనతోనే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని రాష్ట్రపతి పదవికి నిలబెట్టాలని పోరారు. ఇప్పుడు ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఇక రాహుల్ గాంధీని మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ప్రతిపక్షాలేవీ గుర్తించడం లేవు. అలా ఎదుగుతాడన్న నమ్మకం ఎవరికీ లేదు.
ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ స్పీకర్‌గా, విదేశీ దౌత్యవేత్తగా సమర్థంగా విధులు నిర్వహించిన రాజకీయానుభవమే కాకుండా మీరా కుమార్‌కు ఉన్నత విద్యార్హతలు ఉన్నాయి. పైగా దళిత నేపథ్యం. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయే కనుక ఆ పార్టీనే మీరా కుమార్‌ను బరిలోకి దించితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం ‘గాంధీ–నెహ్రూ’ వారసత్వ పాలనను పక్కన పెట్టాల్సిందే.
1991లో అలా చేయడం వల్లనే పీవీ నరసింహారావు దేశ ప్రధాని కాగలిగారు. 2004, 2009లో మన్మోహన్ సింగ్ రెండుసార్లు ప్రధాని కాగలిగారు. కొంతకాలంపాటు కాంగ్రెస్ పుత్రరత్నాన్ని పక్కన పెడితే మరింత బలంగా ప్రతిపక్షాలు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరోదఫా ఎన్నికల్లో పుత్ర రత్నానికి పట్టాభిషేకం చేసే అవకాశం రావచ్చు. ప్రస్తుతానికి బంతి సోనియా గాంధీ చేతుల్లోనే ఉంది.
––––––––ఓ సెక్యులరిస్ట్ కామెంట్