మహారాష్ట్ర కేబినెట్‌లోకి బోర్డు కోశాధికారి ఆశిష్ షెలార్
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో మరో కీలక పదవి ఖాళీ అయ్యింది. కోశాధికారి ఆశిష్ షెలార్ మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో చేరారు. ఆదివారం ఆయన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో క్రికెట్ బోర్డులోని తన కోశాధికారి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రెండేళ్ల క్రితం 2022 అక్టోబర్‌లో బీసీసీఐ కోశాధికారిగా షెలార్ ఎన్నికయ్యారు.
గత నెల మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా... భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ముంబై సబర్బన్ జిల్లా పరిధిలోని వాంద్రే వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆశిష్ షెలార్ ఎన్నికయ్యారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులెవరూ బోర్డు కార్యవర్గంలో ఉండకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయి.
2016లో ఏర్పాటైన జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే 2022లో ఎమ్మెల్యే, ఎంపీలకు మినహాయింపునిస్తూ కేబినెట్ హోదా ఉన్న వారిని అనర్హులని తీసుకొచి్చన సవరణకు సుప్రీం ఆమోదం తెలపడంతో ఇన్నాళ్లు ఎమ్మెల్యేగా ఉన్న షెలార్ కోశాధికారిగానూ పనిచేశారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రి కావడంతో బోర్డు పదవికి రాజీనామా చేశారు.
ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా జై షా ఎన్నికవడంతో బీసీసీఐ కార్యదర్శి పదవి కూడా ఖాళీ అయ్యింది. ఇప్పుడు కీలకమైన కార్యదర్శి, కోశాధికారి పదవులు రెండూ ఖాళీగా ఉన్నాయి. అయితే జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా ప్రస్తుతానికి తాత్కాలిక కార్యదర్శిగా పని చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment