ఫిక్సింగ్‌పై విచారణ కమిటీలో గంగూలీ ?
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్కామ్‌పై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విచారణ జరపనున్నాడా ? జస్టిస్ ముద్గల్ సారథ్యంలోని కొత్త కమిటీలో దాదాకు చోటు దక్కనుందా ? స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కామ్‌పై విచారణకు సుప్రీం కోర్టు కొత్త కమిటీని ప్రకటించనున్న నేపథ్యంలో ఇప్పుడు గంగూలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఐపీఎల్ స్కామ్‌పై విచారణ జరిపే కమిటీలో వివాదరహితుడైన ప్రముఖ మాజీ క్రికెటర్‌ను నియమించాలని గత మంగళవారం సుప్రీం కోర్టును జస్టిస్ ముకుల్ ముద్గల్ కోరారు. అంతేకాదు మాజీ క్రికెటర్ల పేర్లతో ఒక జాబితాను సుప్రీం ముందుంచినట్లు తెలుస్తోంది. ఇందులో గంగూలీ పేరు కూడా ఉన్నట్లు సమాచారం. మాజీ సెలెక్టర్, 1983 ప్రపంచకప్‌లో భారత జట్టు జయకేతనం ఎగరేయడంలో కీలకపాత్ర పోషించిన మొహిందర్ అమర్‌నాథ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.
వచ్చేవారం కొత్త కమిటీ ప్రకటన ?
ఐపీఎల్ స్కామ్‌పై విచారణకు శుక్రవారమే కొత్త కమిటీని ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. దీంతో కొత్త కమిటీపై ధర్మాసనం వచ్చే వారం నిర్ణయం తీసుకోనుంది.
సాకర్‌తో దాదా బిజీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇకపై సాకర్‌తో బిజీ కానున్నాడు. ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్)లో కోల్‌కతా ఫ్రాంచైజీ సహ యజమాని అయిన గంగూలీ త్వరలో లిస్బన్ వెళ్లనున్నాడు. చాంపియన్స్ లీగ్‌లో ఫైనల్‌కు చేరిన ‘అట్లెటికో మాడ్రిడ్’ సాకర్ జట్టు యజమాని కోల్‌కతా ఫ్రాంచైజీలో భాగస్వామి కావడంతో వీరిరువురు ఐఎస్‌ఎల్‌లో తమ జట్టు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ నెల 6న కోల్‌కతా జట్టు పేరును ఆవిష్కరిస్తారు.