కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన కేసులో సర్వోన్నత న్యాయస్థానం వీలైనంత త్వరగా తీర్పునివ్వాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విజ్ఞప్తిచేశాడు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు.. ఇలాంటి దారుణాలకు పాల్పడాలన్న ఆలోచన వచ్చినా వణుకుపుట్టేలా తీర్పు ఉండాలన్నాడు. కాగా పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా దారుణానికి పాల్పడ్డారు దుండగులు. రాష్ట్రంతో పాటు దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ జరుపుతోంది.
ప్రపంచం మొత్తానికి ఈ తీర్పు ఆదర్శంగా ఉండాలి
ఈ క్రమంలో కేసు సుప్రీంకోర్టుకు చేరగా.. ఘటనకు సంబంధించిన దర్యాప్తు తాజా నివేదికను సెప్టెంబరు 17లోగా సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. సోమవారం నాటి విచారణలో భాగంగా ఈ మేరకు గడువు ఇచ్చింది. ఈ విషయంపై స్పందించిన సౌరవ్ గంగూలీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘సుప్రీం కోర్టు ఈరోజు ఎలాంటి ఆదేశాలు ఇచ్చిందో నాకు పూర్తి సమాచారం లేదు.
అయితే, బాధితురాలికి మద్దతుగా జరిగిన ఉద్యమంలో ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాడారు. రాజకీయాలకు అతీతంగా వీధుల్లో నిరసన చేశారు. వారందరికీ న్యాయం జరగాలి. న్యాయస్థానం విచారణ ప్రక్రియకు సమయం పడుతుందని తెలుసు. అయితే, వీలైనంత సత్వరంగా తీర్పును ఇవ్వాలని సుప్రీం కోర్టును అభ్యర్థిస్తున్నా. ప్రపంచం మొత్తానికి ఈ తీర్పు ఆదర్శంగా ఉండాలి.
ఇదీ చదవండి: అభయ కేసులో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం!
చెడు ఆలోచనలు చేసే వారి గుండెల్లో గుబులుపుట్టేలా ఉండాలి. బాధితురాలికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరు న్యాయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు’’ అని పేర్కొన్నాడు.
రాజకీయ రగడ
కాగా ఈ హత్యాచార కేసులో పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీజేపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆయా పార్టీల అభిమానులు సైతం రెండుగా చీలిపోయి.. పరస్పరం విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment