
'మహారాష్ట్రలో షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్'
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో భాగంగా మహారాష్ట్రలో నిర్వహించే మ్యాచ్ ల షెడ్యూల్ విషయంలో ఎటువంటి మార్పులు ఉండబోవని లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. గత వంద ఏళ్లలో ఎన్నడూలేని కరువు రాష్ట్రంలో తాండవిస్తున్న కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లను ఇక్కడ నిర్వహించవద్దని బీజేపీ కార్యదర్శి వివేకానంద గుప్తా బీసీసీఐ ప్రెసిడెంట్ శశాంక్ మనోహర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఐపీఎల్ షెడ్యూల్ అంశంపై శుక్లా మీడియాతో మాట్లాడారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ టోర్నీ జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు మహారాష్ట్ర రైతులకు అండగా నిలబడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
'మ్యాచ్ ల వేదికలను మార్చాలనుకోవడం లేదు. మ్యాచ్ ల నిర్వహణకు కొద్ది శాతం నీరు మాత్రమే అవసరమవుతుంది. కానీ రైతులకు అధిక శాతంలో నీరు అవసరమనే విషయం మాకు తెలుసు. రాష్ట్ర రైతుల నీరు సమస్యను తీర్చడానికి అన్ని రాజకీయ పార్టాలు నడుంబిగించాలి. రైతులకు సాయం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ముందు ఓ నివేదికను రూపొందిస్తే మా నుంచి తగిన సహకారాన్ని అందిస్తాం'అని శుక్లా పేర్కొన్నారు.