న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో బీసీసీఐ ఇక ఐపీఎల్-7 వేదికను నిర్ణయించే పనిలో పడింది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బుధవారం సమావేశమై చర్చలు జరిపింది.
బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌తోపాటు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి సంజయ్‌పటేల్, ఐపీఎల్ చైర్మన్ రంజిబ్ బిస్వాల్, సీఈఓ సుందరరామన్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు ఎన్నికలు జరగనుండగా, మే 16న ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరోవైపు ఏప్రిల్ 9 నుంచి జూన్ 3 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించటానికి సమయముంది. దానికి ఎన్నికలు పూర్తయ్యేదాకా భారత్ ఆవల మ్యాచ్‌ల్ని నిర్వహించి ఓట్ల లెక్కింపు అనంతరం మిగిలిన మ్యాచ్‌ల్ని భారత్‌లో ఆడించాలనే నిర్ణయానికి బీసీసీఐ వచ్చినట్లు తెలుస్తోంది.
ఇదే విషయమై బిస్వాల్ మాట్లాడుతూ.. 60 నుంచి 70 శాతం మ్యాచ్‌ల్ని భారత్‌లోనే నిర్వహిస్తామని, మరో రెండు రోజుల్లో తుదినిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రత్యామ్నాయ వేదికలుగా దక్షిణాఫ్రికాతోపాటు బంగ్లాదేశ్, యూఏఈల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.