ధోని ఏం చేశాడని! | IPL without MS Dhoni will be tough | Sakshi
Sakshi News home page

ధోని ఏం చేశాడని!

Published Tue, Jul 21 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

ధోని ఏం చేశాడని!

ధోని ఏం చేశాడని!

ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్‌ను రెండేళ్ల పాటు నిషేధించాలనే లోధా కమిటీ తీర్పు రాగానే విమర్శకులంతా ఒళ్లు విరుచుకున్నారు. అదేంటో ఎవరి మీదా లేనట్లు ధోనిని నిందించడం మొదలుపెట్టారు. కొందరు సోకాల్డ్ ‘నిపుణులు’ అసలు అతనికి చిత్తశుద్ధి లేదనే వాదన తీసుకొచ్చారు. అసలు ధోని చేసిన తప్పేంటి? ఫ్రాంచైజీల యజమానులు పందేలు కాసుకుంటే  అతనేం చేస్తాడు?
 
సాక్షి క్రీడావిభాగం
ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఐపీఎల్ తొలి సీజన్ నుంచి కూడా ఈ లీగ్‌కు ప్రధాన శక్తి ధోని. భారత్‌కు 2007లో టి20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా... ఐపీఎల్‌లో ఖరీదైన తొలి క్రికెటర్‌గా... ఓ రకంగా ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని ఈ ఎనిమిదేళ్లూ వ్యవహరించాడు. ధోని కంటే గొప్ప క్రికెటర్లు, అతనికంటే నైపుణ్యం ఉన్న వాళ్లు లీగ్‌లో ఆడి ఉండొచ్చు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ అనే జట్టు మిగిలిన అన్ని జట్ల కంటే విజయవంతం కావడానికి కారణం ధోని. ఇప్పుడు చెన్నై జట్టు లీగ్ నుంచి తొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల తొలుత నష్టపోయేది కూడా ధోనియే. అయినా సరే... మీడియాలో కొన్ని శక్తులు, బోర్డులో కొందరు పెద్దలు కలిసి ధోని మీద దుష్ర్పచారం మొదలుపెట్టారు.
ఒకవేళ ఈ స్టార్ క్రికెటర్ తప్పు చేసి ఉంటే ఈపాటికి పతనమయ్యేవాడు. కానీ ఇప్పటివరకూ ఎక్కడైనా ఊహాగానాలే తప్ప ధోని ఏదైనా తప్పు చేసినట్లు ఎక్కడా బయటకు రాలేదు. ముద్గల్ కమిటీ తమ నివేదికలో క్రికెటర్ల పేర్లు పేర్కొందనే వార్త రాగానే... అందులో ధోని ఉన్నాడంటూ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా లోధా కమిటీ తీర్పు వచ్చిన వెంటనే జార్ఖండ్ డైనమైట్ వైపు బాణాలు ఎక్కుపెట్టారు.
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోని. అతను సాధించని ఘనత లేదు. ఇప్పుడు అతణ్ని నిందిస్తున్న వాళ్లంతా మొన్నటిదాకా ధోని ప్రాపకం కోసం తాపత్రయపడ్డవారే. అయితే భారత క్రికెట్‌లో క్రమంగా కొత్త శకం మొదలవుతోందనే సంకేతం ఇప్పుడు వచ్చింది. శ్రీనివాసన్ బోర్డులో లేకపోవడం, టెస్టు ఫార్మాట్ నుంచి ధోని తప్పుకోవడం వల్ల భారత క్రికెట్‌లో సమీకరణాలు చాలా మారాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితి కోసం ఎదురుచూస్తున్న వాళ్లంతా ఇప్పుడు చెలరేగుతున్నారు.
గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ చేయడం చెన్నై జట్టుకు వచ్చిన ప్రధాన నష్టం. యజమాని బెట్టింగ్ చేస్తున్న విషయం ధోనికి ఎలా తెలుస్తుంది. ఒకవేళ మెయ్యప్పన్ మ్యాచ్‌లు ఫిక్స్ చేసి ఉంటే దానికి ధోని మద్దతు అవసరమయ్యేది. కానీ మెయ్యప్పన్ ఎక్కడా ఫిక్సింగ్ చేయలేదు. కేవలం బెట్టింగ్ మాత్రమే చేశాడు. అందుకే అతను నష్టపోయాడు. ఇంత చిన్న లాజిక్‌ను కూడా మరచిపోయి విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
మెయ్యప్పన్‌తో చెన్నై జట్టుకు సంబంధం లేదనే వాదన వినిపించింది ఆ జట్టు యాజమాన్యం. ఈ మాటను ధోని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. ముద్గల్ కమి టీ ముందు విచారణకు హాజరైన ధోని ఏం చెప్పాడో బయటివాళ్లకు తెలి యదు. యాజమాన్యం ఎలాంటి వాదన చేసినా ముద్గల్, లోధా కమిటీలు మెయ్యప్పన్‌ను జట్టు యజమానిగానే ఖాయంచేసి శిక్ష విధించాయి. విచారణలో క్రికెటర్లు మెయ్యప్పన్ తమ యజమాని అని ఒప్పుకున్నట్లే.
ఏమైనా ఈ వ్యవహారంలో క్రికెటర్లకు సంబంధం లేదు. సంబం ధం ఉన్న ముగ్గురూ ఇప్పటికే శిక్ష ఎదుర్కొంటున్నారు. రైనా, బ్రేవో లాంటి ఆటగాళ్లను లలిత్ మోడి నిందించాలని చూసినా ఐసీసీయే వాళ్లకు క్లీన్ చిట్ ఇచ్చింది. శ్రీశాంత్ తప్పు చేశాడని ఆ జట్టు మెంటార్‌గా ఉన్న ద్రవిడ్‌ను నిందించడం ఎంత మూర్ఖత్వమో ఇప్పుడు చెన్నై జట్టుపై నిషేధం పడగానే ధోనిని నిందించడం అంతే మూర్ఖత్వం.
 
 
డెక్కన్ చార్జర్స్‌లో కొత్త ఆశలు
ఐపీఎల్ నుంచి బయటకు వెళ్లిపోయిన జట్టు డె క్కన్ చార్జర్స్ మళ్లీ పునరాగమనంపై ఆశలు పెంచుకుంది. ఈ జట్టుకు బీసీసీఐకి మధ్య ఉన్న కేసును ఆర్బిట్రేటర్ ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంది. ఈ నెలాఖరులో ఆర్బిట్రేటర్ తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల కొచ్చి టస్కర్స్ విషయంలో ఆర్బిట్రేటర్ ఐపీఎల్ జట్టుకు అనుకూలంగా తీర్పు ఇచ్చి రూ.550 కోట్లు పరిహారం ఇవ్వాలని బీసీసీఐని ఆదేశించారు. కాబట్టి తమ జట్టు విషయంలో కూడా తీర్పు అనుకూలంగానే ఉంటుందని డీసీ జట్టు వర్గాలు భావిస్తున్నాయి. ఏమాత్రం అవకాశం దొరికినా పునరాగమనం చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌కు వేరే జట్టు ఉన్నందున... మరో నగరం నుంచి అయినా సరే డెక్కన్ చార్జర్స్‌ను నడపాలనేది ఆలోచన. మరి వీళ్ల అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement