భువనేశ్వర్: కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్-సి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. దీన్ని ఆసరాగా చేసుకొని లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇక్బాల్ అబ్దుల్లా (214 బంతుల్లో 157 బ్యాటింగ్; 14 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో కేరళ తొలి ఇన్నింగ్‌సలో భారీస్కోరు చేసింది. శుక్రవారం 223/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన కేరళ ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ సచిన్ బేబి (209 బంతుల్లో 80; 8 ఫోర్లు), జలజ్ సక్సేనా (130 బంతుల్లో 79; 13 ఫోర్లు) ఐదో వికెట్‌కు 147 పరుగులు జోడించారు. జలజ్ నిష్ర్కమణ తర్వాత వచ్చిన ఫెర్నాండెజ్ (12) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు.
దీంతో ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ను తలపించాడు. పసలేని హైదరాబాద్ బౌలింగ్‌పై సుదీర్ఘ ఇన్నింగ్‌సకు శ్రీకారం చుట్టాడు. క్రీజులో పాతుకుపోయిన తర్వాత పరుగుల వరద పారించాడు. అదును చిక్కినప్పుడల్లా భారీ సిక్సర్లతో అలరించాడు. ఇతనికి మొదట సచిన్ బేబి, తర్వాత మోనిశ్ (152 బంతుల్లో 40; 4 ఫోర్లు) చక్కని సహకారం అందించారు.
మోనిశ్ అండతో సెంచరీ పూర్తి చేసుకున్న ఇక్బాల్ అబ్దుల్లా తర్వాత కూడా తన జోరు తగ్గించలేదు. కుదురుగా ఆడుతూ 150 పరుగుల మైలురాయిని అధిగమించాడు. దీంతో జట్టు స్కోరు 500 పరుగులు దాటింది. ఆట ముగిసే సమయానికి ఇతనితో పాటు సందీప్ వారియర్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్‌కు 3 వికెట్లు దక్కాయి. రవికిరణ్ 2, సి.వి.మిలింద్, సిరాజ్, ఆకాశ్ భండారీ తలా ఒక వికెట్ పడగొట్టారు.