
ఎట్టకేలకు పసిడి...
మాస్కో (రష్యా): ‘ఎప్పుడూ నాలుగో స్థానమే’ అని తనపై పడిన ముద్రను తొలగించుకుంటూ ఐర్లాండ్ అథ్లెట్ రాబర్ట్ హెఫర్‌నన్ ఈసారి ఏకంగా విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 30 ఏళ్ల తర్వాత ఐర్లాండ్‌కు తొలి పతకం అందించాడు. బుధవారం జరిగిన పురుషుల 50 కిలోమీటర్ల నడకలో 35 ఏళ్ల హెఫర్‌నన్ 3 గంటల 37 నిమిషాల 56 సెకన్లలో గమ్యానికి చేరుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
మిఖాయిల్ రిజోవ్ (రష్యా-3గం:38ని:58 సెకన్లు) రజతం నెగ్గగా... జారెడ్ టాలెంట్ (ఆస్ట్రేలియా-3గం:40ని:03 సెకన్లు) కాంస్యం సాధించాడు. 2010 యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో హెఫర్‌నన్ 20 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు నడకలో నాలుగో స్థానం... 2012 లండన్ ఒలింపిక్స్‌లో 50 కిలోమీటర్ల నడకలో మరోసారి నాలుగో స్థానం పొందాడు. దాంతో అతనిపై ‘మిస్టర్ ఫోర్త్’ అని ముద్ర పడిపోయింది. అయితే ఈసారి అందరి అంచనాలను తారుమారు చేస్తూ హెఫర్‌నన్ విజేతగా నిలిచి ‘మిస్టర్ గోల్డ్‌మెడల్’గా పేరు తెచ్చుకున్నాడు.
యాదృచ్చికంగా ఐర్లాండ్‌కు చివరిసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 1983 ఆగస్టు 14న పతకం వచ్చింది. ఫిన్‌లాండ్‌లోని హెల్సింకిలో జరిగిన తొలి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈమన్ కాగ్లాన్ పురుషుల 5000 మీటర్ల రేసులో ఐర్లాండ్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత ఆగస్టు 14న రాబర్ట్ హెఫర్‌నన్ రూపంలో ఐర్లాండ్‌కు ఈ మెగా ఈవెంట్‌లో మళ్లీ పసిడి పతకం రావడం విశేషం.
రాణాకు 33వ స్థానం
మరోవైపు ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో భారత అథ్లెట్స్ నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. 50 కిలోమీటర్ల నడకలో పోటీపడిన బసంత బహదూర్ రాణా 3 గంటల 58 నిమిషాల 20 సెకన్లలో గమ్యానికి చేరుకొని 33వ స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన సందీప కుమార్ నిబంధనలకు విరుద్ధంగా నడక సాగించడంతో 35 కిలోమీటర్ల తర్వాత అతనిపై అనర్హత వేటు వేశారు.