ఆమెలా బాణం ఎవ్వరూ వేయలేరు!
మాస్కో: గురిచూసి కొట్టడం అనే నైపుణ్యం మనకు విలువిద్యగా సుపరిచితమే. సాధారణంగా చేతులతోనే విల్లును ఎక్కుపెట్టి బాణాల్నిసంధిస్తాం.అయితే దానికి అతీతంగా అద్భుత విన్యాసాలతో అబ్బురుపరుస్తుంది ఒక యువతి. పురాణాల్లో అర్జునుడు మత్స్య యంత్రాన్ని నీటిలో చూసి ఛేదించే ఘట్టం కడు ఆసక్తికరమైతే, మరి ఈ అమ్మాయి తన రెండు కాళ్లనే చేతులుగా చేసుకుని విలు విద్యను ప్రదర్శిస్తోంది. అటు చేతులతోనూ, కాళ్లతోనూ తన గురి తప్పకుండా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే ఈ విద్యలో పలు సాహసాలు చేసి శభాష్ అనిపించుకుంటోంది.
అన్నా బెలిష్.. రష్యాకు చెందిన ఆ అమ్మాయి వయసు 19 ఏళ్లు. ఆమెకు ఆర్చరీ అంటే ప్రాణం. చిన్నప్పట్నుంచి అదే ధ్యాస, అదే శ్వాస. దాంతో ఇప్పడు ఆన్ లైన్ సెలబ్రెటీగా మారిపోయింది. ఆ విద్య అన్నాకు ఎలా వచ్చిందంటే మాత్రం దానికి సమాధానం దొరకపోయినా.. ఆమె చేసే సాహసాన్ని చూసిన వారిని మాత్రం తప్పకుండా ఆశ్చర్యపరచక మానదు.
తమ అమ్మాయి చేసే ఈ విన్యాసాలను చూసి తల్లి దండ్రులు గర్వంగా ఫీలవుతున్నారు. తమది సామాన్య కుటుంబమే అయినా కూతురు చేసే ఫీట్లు ప్రపంచ వ్యాప్తం కావాలని తండ్రి సెర్జీ బెలిష్ ఆక్షాంక్ష. రైల్వే వర్కర్ గా జీవనం సాగిస్తున్న తనకు కూతురి ద్వారా సరికొత్త అనుభూతి కలుగుతుందని సెర్జీ వ్యాఖ్యానించాడు. ఆ విద్య కూతురికి ఎలా వచ్చిందో తనకు కూడా తెలియదని ఆమెలోని ప్రతిభను చూసి మురిసిపోతున్నాడు. బాల్యం నుంచి కూడా వ్యాయామంలో చక్కటి విన్యాసాలతో అన్నా ఆకట్టుకునేదన్నాడు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సాహస ప్రదర్శనకు సంబంధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు కోసం అప్లై కూడా చేశారు. గిన్నిస్ లో రికార్డులో సంగతి అలా ఉంచితే, ఈ ప్రతిభావంతురాలు అంతర్జాతీయ యవనికపై అత్యుత్తమ విలువిద్య క్రీడాకారిణి అనిపించుకుంటుందో లేదో?చూడాల్సిందే.