
న్యూజిలాండ్ పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టును కొంత ఆందోళనపరిచే వార్త ఇది. ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలోకి దిగిన టీమిండియా ప్రధాన పేసర్ ఇషాంత్ శర్మ చీలమండకు గాయమైంది. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. విదర్భ కెప్టెన్ ఫైజ్ ఫజల్‌కు బౌలింగ్ చేసిన ఇషాంత్ వెనక్కి తిరిగి గట్టిగా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసే క్రమంలో పట్టు తప్పి పడిపోయాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడు సహాయక సిబ్బంది వెంట రాగా మైదానం వీడాల్సి వచ్చింది. ‘ఇషాంత్ కాలు మడత పడిపోవడంతో గాయమైంది. వాపు చాలా ఎక్కువగా ఉంది.
ప్రస్తుతం గాయం తీవ్రంగానే కనిపిస్తుండటంతో ఇక మ్యాచ్‌లో కొనసాగించరాదని నిర్ణయించాం. అది ఫ్రాక్చర్ కాకూడదని కోరుకుంటున్నాం’ అని ఢిల్లీ జట్టు ప్రకటించింది. ఇషాంత్ త్వరగానే కోలుకుంటాడని ఆశిస్తున్నామని, అయితే నిబంధనల ప్రకారం అతను జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి పునరావాస చికిత్స తీసుకోవాల్సిందేనని కూడా వెల్లడించింది. ఆ తర్వాత రిటర్న్ టు ప్లే (ఆర్‌టీపీ) సర్టిఫికెట్ సమర్పిస్తేనే భారత జట్టు కోసం సెలక్టర్లు పరిశీలిస్తారు. అయితే ఇషాంత్ ప్రస్తుతం భారత జట్టులో టెస్టు స్పెషలిస్ట్‌గానే కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఫిబ్రవరి 21 నుంచి జరగనున్న నేపథ్యంలో ఇషాంత్ కోలుకునేందుకు తగినంత సమయం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment