కోహ్లీ కెప్టెన్సీపై అశ్విన్ ఆందోళన
దూకుడే మంత్రంగా చెలరేగిపోయే ఆటగాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం కోహ్లీ టెస్టు కెప్టెన్సీతో పాటు అన్ని ఫార్మాట్లకు సారథ్యం వహించనున్నాడు. మహేంద్రసింగ్ ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి గతవారం తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇన్నాళ్లు కూల్‌గా సాగిన లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ భవిష్యత్తులోనూ కూల్ గా ఉంటుందో లేదోనని టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన చెందుతున్నాడు. దూకుడుతో కోహ్లీ తీసుకునే నిర్ణయాలకు అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు. కఠిన సమమయాల్లోనూ కీలకపాత్ర పోషిస్తాడని ధోనీని ప్రశంసించాడు. ఇటీవల తన విజయంలో భార్య, కెప్టెన్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లేలకు ప్రాధాన్యాన్ని ఇస్తూ ధోనీ పేరు ప్రస్తావించకపోవడంతో అశ్విన్ తీవ్ర విమర్శల పాలయ్యాడు.
'2010లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభంనుంచీ ధోనీ కెప్టెన్సీలోనే వన్డేలు, టీ20లు ఆడుతూ వచ్చాను. ఈ 15న ఇంగ్లండ్ తో జరిగే తొలి వన్డేలో ధోనీ కెప్టెన్సీలో ఆడకపోవడం మార్పును సూచిస్తుంది. గతంలో ధోనీ వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ గా వ్యవహరించేవాడు. ఇప్పుడు విరాట్ షార్ట్ మిడ్ వికెట్, షార్ట్ కవర్‌లో ఫీల్డింగ్ చేస్తాడు. అతడి వ్యూహాలకు అనుగుణంగా ఆడాల్సి వస్తుంది. ధోనీ అయితే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు ప్రాధాన్యం ఇచ్చి రన్స్ కంట్రోల్ చేపిస్తాడు. కోహ్లీ మాత్రం ఈ ఓవర్లలోనూ అటాకింగ్ గేమ్ ప్లాన్‌లో ఉండి.. వికెట్లు తీయడంపైనే దృష్టిసారిస్తాడు. ఇది మ్యాచ్ ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది' అని టాప్ స్పిన్నర్ అశ్విన్ వివరించాడు.