'ఇలాగైతే కెప్టెన్ ఎవరైనా కష్టమే'
గ్రాస్ ఐలెట్:భారత్తో జరిగిన మూడో టెస్టులో తమ జట్టు ఘోర పరాజయం చెందడం పట్ల వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం పోరాడేతత్వం లేనప్పుడు ఆ జట్టుకు నాయకత్వం వహించడం అనేది చాలా కష్టమన్నాడు. టాపార్డర్ బ్యాట్స్మెన్ బాధ్యతరహితంగా ఆడటమే తమ ఓటమి కారణమన్నాడు. తమ జట్టులో నిలకడ లోపించిన విషయం మూడో టెస్టులో చాలా స్పష్టంగా కనబడిందన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో మెరుగైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ, రెండో ఇన్నింగ్స్ లో పూర్తిగా చేతులెత్తేశామన్నాడు.
'వెస్టిండీస్ బ్యాట్స్మెన్ మరింత బాధ్యాతాయుతంగా ఆడాలి. ముఖ్యంగా టాపార్డర్ ఆటగాళ్లలో నిలకడ అవసరం. ఇంకా ఒక టెస్టు ఉండగానే సిరీస్ కోల్పోవడం చాలా బాధాకరం. మా అత్యంత పేలవ ప్రదర్శనతోనే టీమిండియాకు సిరీస్ను అప్పజెప్పాం. ఇలాగైతే జట్టుకు కెప్టెన్గా చేయడం చాలా కష్టం. ఒక్కసారి టీమిండియా జట్టును చూడండి. ఆ జట్టులో చాలా నిలకడ ఉంది. గత కొంతకాలంగా అత్యంత పటిష్టంగా, నిలకడగా ఉన్న జట్టు భారత క్రికెట్ జట్టు. ప్రస్తుతం విండీస్ జట్టులో చాలామంది యువకులు ఉన్నారు. మనల్ని మనం మెరుగుపరుచుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. ప్రతీ ఆటగాడు 20, 30 పరుగులకే పరిమితం కాకుండా, ఆయా స్కోర్లను హాఫ్ సెంచరీలుగా, సెంచరీలుగా మార్చేందుకు యత్నించండి'అని హోల్డర్ హితబోధ చేశాడు.
నాలుగు టెస్టుల సిరీస్ను ఇంకా మ్యాచ్ ఉండగానే భారత్ 2-0 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడో టెస్టులో 237పరుగులతో విండీస్ పై జయభేరి మోగించిన భారత్.. కరీబియన్ గడ్డపై వరుసగా 'హ్యాట్రిక్' సిరీస్లను సాధించింది.