సాక్షి, హైదరాబాద్: తమ జట్టు చేసిన తప్పులే తమకు ఐపీఎల్ ట్రోపీని దూరం చేశాయని చెన్నై సూపర్‌కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో ఘనవిజయాన్ని సాధించి.. ఐపీఎల్ –2019 విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డి కాక్ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు.
బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని తక్కువ స్కోరుకు కట్టడి చేసినా.. షేన్ వాట్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. జట్టును విజయానికి చేరువగా తీసుకొచ్చినా.. చివరి ఓవర్‌లో చేసిన తప్పిదాల కారణంగా చెన్నై జట్టు విజయం ముంగిట బోల్తా పడింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ గురించి ధోనీ వ్యాఖ్యానిస్తూ.. ఇది ఫన్నీ ఫైనల్ మ్యాచ్ అని, మ్యాచ్ ఆసాంతం ఇరుజట్లు పరస్పరం ట్రోఫీని ఇచ్చిపుచ్చుకున్నాయని పేర్కొన్నారు.
ముంబై ఇండియన్స్ ఒకదశలో వరుసగా వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో పడినా.. కీరన్ పొలార్డ్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అనంతరం చెన్నై జట్టు ధాటిగానే ఆరంభించింది. అయితే, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ వికెట్లు వరుసగా కోల్పోవడం ఆ జట్టును దెబ్బతీసింది. అయితే, వాట్సన్ ధాటిగా ఆడుతూ.. జట్టును విజయతీరాలకు చేర్చేలా కనిపించాడు. కానీ ఉత్కంఠగా సాగిన ఫైనల్ ఓవర్‌లో లసిత్ మలింగా మ్యాజిక్‌తో ముంబైదే పైచేయి అయింది.
మ్యాచ్ ప్రజెంటేషన్ వేడుక అనంతరం మాట్లాడిన ధోనీ మ్యాచ్ గమనంపై స్పందిస్తూ.. ‘ఇది చాలా ఫన్నీ గేమ్. మ్యాచ్ ఆసాంతం మేం పరస్పరం ట్రోఫీని చేతులు మార్చుకుంటూ వచ్చాం. ఇరు జట్టు తప్పిదాలు చేశాయి. ఒక తప్పిదం తక్కువ చేయడం వల్ల ప్రత్యర్థి జట్టు విజేతగా అవతరించింది’ అని ధోనీ పేర్కొన్నాడు. బౌలర్లు అద్భుతంగా రాణించి ముంబైని 150 కన్నా తక్కువ స్కోరుకు కట్టడి చేశారని, కానీ, బ్యాటింగ్‌లో తాము అనుకున్నమేరకు రాణించకపోవడంతో పరాజయం తప్పలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇప్పుడు తమ ఫోకస్ వరల్డ్‌కప్ వైపు మళ్లించామని, అయితే, చెన్నై ఓటమికి కారణాలేమిటో సమీక్షిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment