ఈడెన్ గార్డెన్స్‌లో నాలుగో రోజు ఆటకు ముందు గంట మోగిస్తున్న అనురాగ్ ఠాకూర్
ఒక టోర్నీలోనే ఆడగలమన్న బీసీసీఐ
కోల్‌కతా: లోధా కమిటీ సిఫారసుల్లో చాలా అంశాలను తాము ఇప్పటికే అమల్లోకి తెచ్చామని, అయితే కొన్ని విషయాల్లో ఉన్న సమస్యలను సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నారు. తాము సుప్రీంను గౌరవిస్తామని, అయితే తమకు బోర్డు నియమావళి కూడా ముఖ్యమని ఆయన చెప్పారు. ఐపీఎల్‌కు ముందు, తర్వాత 15 రోజుల చొప్పున విరామం ఉండాలని లోధా కమిటీ చెబుతోందని... ఇలాంటి స్థితిలో తాము వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ లేదా ఐపీఎల్‌లలో ఒక దానినే ఎంచుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు.
చాంపియన్‌స ట్రోఫీ జూన్ 1నుంచి ప్రారంభం కానుండగా, ఐపీఎల్ మే చివరి వారంలో ముగుస్తుంది. బిజీ షెడ్యూల్‌లో ఐపీఎల్‌ను వేరే తేదీల్లో నిర్వహించే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. భారత క్రికెట్‌పై ఎంతో ప్రభావం చూపించిన పలు దేశవాళీ జట్లకు ఒకే రాష్ట్రం-ఒకే ఓటు నిబంధన ఇబ్బందులు సృష్టిస్తుందని, అందుకే ఆ సూచనను వ్యతిరేకిస్తున్నట్లు ఠాకూర్ వెల్లడించారు. మరో వైపు బీసీసీఐ అకౌంట్లనుంచి రాష్ట్ర క్రికెట్ సంఘాలకు డబ్బులు బదిలీ చేయరాదంటూ లోధా కమిటీ రెండు బ్యాంకులను కోరింది.
సెప్టెంబర్ 30న ఎస్‌జీఎంలో బీసీసీఐ తీసుకున్న కొన్ని ఆర్థిక పరమైన నిర్ణయాలు సుప్రీం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉన్నాయని, అందు వల్ల దీనికి సంబంధించి ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని లోధా కమిటీ సదరు బ్యాంకులకు లేఖ రాసింది. క్రికెట్ అభివృద్ధి కోసం వివిధ రాష్ట్ర సంఘాలకు ప్రతీ ఏటా ఇస్తున్న రూ. 60 కోట్లకు అదనంగా మరో రూ. 10 కోట్లు ఇవ్వాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.