సాక్షి, స్పోర్ట్స్ : సఫారీ గడ్డపై సమరానికి భారత్ సిద్ధమైన వేళ.. ప్రొటీస్ మాజీ దిగ్గజం జాక్వెస్ కల్లిస్ తమ జట్టుకు హెచ్చరికలు జారీ చేశాడు. తమ పిచ్‌లపై టీమిండియా ట్రాక్ రికార్డు అంత ఘనంగా లేదని సౌతాఫ్రికా ఆటగాళ్లు మీడియా ముందు వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్‌ను తక్కువ అంచనా వేయటానికి వీల్లేదని కల్లిస్ వారికి సూచిస్తున్నాడు.
‘‘భారత్ వరస విజయాలతో ఊపు మీద ఉంది. వారి బౌలింగ్ లైనప్ అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా ప్రత్యర్థులపై వారు చేసే దాడి ఆసక్తికరంగా ఉంటుంది. అన్నింటికి మించి అవతల కెప్టెన్ కోహ్లి ఉన్నాడు. అతను వరల్డ్ క్లాస్ ప్లేయర్. ఐపీఎల్‌లో అతన్ని చాలా దగ్గరగా చూశాను. ఆకలితో ఉన్న సింహం లాంటోడు. ప్రత్యర్థుల బౌలింగ్‌కు అలవాటుపడితే మాత్రం అతన్ని ఆపటం చాలా కష్టం. ఈ విషయంలో సఫారీ బౌలర్లు మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది’’ అని హెచ్చరించాడు.
టీమిండియా బౌలర్లు షమీ, భువనేశ్వర్‌ల ప్రతిభ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన.. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వాళ్లిద్దరి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఇక పాండ్యా ఆటను అంతగా పరిశీలించలేకపోయానన్న ఆయన.. అతని ఆట కోసం ఎదురు చూస్తున్నట్లు కల్లిస్ తెలిపారు. గాయం నుంచి కోలుకుని డెయిల్ స్టెయిన్ జట్టులోకి రావటం.. మరో రికార్డుకు చేరువలో ఉండటంపై కూడా ఆయన ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. సౌతాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షాన్ పొల్లాక్ ఉండగా.. స్టెయిన్ ఆ రికార్డుకు చేరువయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment