భారత క్రికెట్‌లో 'డబుల్‌ ధమాకా' | Jadeja, Pujara and Vijay given top BCCI contracts | Sakshi
Sakshi News home page

భారత క్రికెట్‌లో 'డబుల్‌ ధమాకా'

Published Thu, Mar 23 2017 1:02 AM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

భారత క్రికెట్‌లో 'డబుల్‌ ధమాకా'

భారత క్రికెట్‌లో 'డబుల్‌ ధమాకా'

ఆటగాళ్ల వార్షిక ఫీజులు రెట్టింపు
► పుజారా, విజయ్, జడేజాలకు ప్రమోషన్‌
►సురేశ్‌ రైనాకు దక్కని చోటు
►బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్‌ల ప్రకటన   


న్యూఢిల్లీ: భారత టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారాకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లలో ప్రమోషన్‌ లభించింది. గతంలో గ్రేడ్‌ ‘బి’లో ఉన్న పుజారాతో పాటు మురళీ విజయ్‌ని కూడా గ్రేడ్‌ ‘ఎ’లోకి చేరుస్తూ బోర్డు కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. వరల్డ్‌ నంబర్‌వన్‌ బౌలర్‌గా ఎదిగిన రవీంద్ర జడేజా కూడా ‘సి’ గ్రేడ్‌ నుంచి నేరుగా ‘ఎ’కు ప్రమోట్‌ కావడం విశేషం.

ఈ అగ్రశ్రేణి జాబితాలో ఇప్పటి వరకు ధోని, కోహ్లి, అశ్విన్, రహానే మాత్రమే ఉండగా ఇప్పుడు పుజారా, విజయ్, జడేజా చేరికతో ఈ సంఖ్య ఏడుకు చేరింది. కొత్త కాంట్రాక్ట్‌ ప్రకారం ఇందులో ఉన్నవారికి ఏడాదికి రూ. 2 కోట్లు వార్షిక ఫీజుగా లభిస్తాయి. గతంలో ఈ జాబితాలో ఉన్నవారికి రూ. కోటి దక్కేవి. గ్రేడ్‌ ‘బి’లో 9 మంది ఆటగాళ్లు, గ్రేడ్‌ ‘సి’లో 16 మంది ఆటగాళ్లు ఉన్నారు.

 ‘బి’, ‘సి’ గ్రేడ్‌ల మొత్తాలను కూడా గత ఏడాదికంటే రెట్టింపు చేశారు. అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగినప్పుడు లభించే మ్యాచ్‌ ఫీజుకు ఈ కాంట్రాక్ట్‌ మొత్తం అదనం. అక్టోబర్‌ 1, 2016 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. అయితే గత ఏడాది కాంట్రాక్ట్‌లు ప్రకటించిన సమయంలో భారత మహిళా జట్టు క్రీడాకారిణులను పరిగణనలోకి తీసుకుంటూ రెండు గ్రేడ్‌లుగా విభజించారు. ఈసారి వారి గురించి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

ఆటగాళ్ల విజ్ఞప్తితో...
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా క్రికెటర్ల కాంట్రాక్ట్‌ మొత్తం కూడా పెంచాలంటూ గత అక్టోబర్‌లో విజ్ఞప్తులు వచ్చాయి. కెప్టెన్‌ కోహ్లి అప్పటి బోర్డు అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌తో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఆ సమయంలో కేవలం టెస్టులకు ప్రాధాన్యత పెంచేందుకు టెస్టు మ్యాచ్‌ ఫీజును రెట్టింపు చేసేందుకు మాత్రం ఠాకూర్‌ అంగీకరించారు. ఇతర అంశాలపై ఇంకా స్పష్టత రాకుండానే ఠాకూర్‌ నిష్క్రమించారు. ఇటీవలే బెంగళూరు టెస్టు తర్వాత కూడా కోహ్లి ఇదే అంశాన్ని ప్రత్యేకంగా సీఓఏ దృష్టికి తీసుకు వచ్చారు. దాంతో బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి, జనరల్‌ మేనేజర్‌ ఎంవీ శ్రీధర్‌లతో చర్చించిన అనంతరం సీఓఏ బృందం కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది.

రైనాకు నిరాశ...
బీసీసీఐ 32 మందితో ప్రకటించిన జాబితాలో సురేశ్‌ రైనాకు చోటు దక్కకపోవడమే అనూహ్యం. గత ఏడాది అతను గ్రేడ్‌ ‘బి’లో ఉన్నాడు. వన్డే జట్టులో స్థానం లేకపోయినా... భారత టి20 జట్టు సభ్యుడిగా ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఈ మ్యాచ్‌లన్నీ కూడా తాజా ఒప్పందాలు అమలు చేయబోతున్న తేదీ తర్వాత ఆడినవే.

రైనాకు దిగువ గ్రేడ్‌కు కూడా పంపించకుండా పూర్తిగా కాంట్రాక్ట్‌ నుంచే తప్పించడం ఆశ్చర్యకర పరిణామం. ఇక అంబటి తిరుపతి రాయుడు, శిఖర్‌ ధావన్‌ గ్రేడ్‌ ‘బి’ నుంచి ‘సి’కి పడిపోయారు. గత ఏడాది జాబితాలో లేని యువరాజ్‌ సింగ్, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు ఈ సారి గ్రేడ్‌ ‘బి’లో స్థానం లభించింది. భారత్‌ తరఫున 3 టి20లు ఆడిన మన్‌దీప్‌ సింగ్, ఒకే ఒక టి20 ఆడిన రిషభ్‌ పంత్‌లకు తొలిసారి చోటు దక్కగా... భారత్‌ తరఫున ఇంకా అరంగేట్రం చేయని శార్దుల్‌ ఠాకూర్‌కు కాంట్రాక్ట్‌ దక్కడం మరో విశేషం.

టెస్టు మ్యాచ్‌ ఆడితే రూ. 15 లక్షలు
భారత ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులు కూడా రెట్టింపయ్యాయి. ఇకపై ఒక టెస్టు మ్యాచ్‌ ఆడితే ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు లభిస్తాయి. టెస్టుల్లో రిజర్వ్‌ ఆటగాడికి రూ. 7 లక్షలు దక్కుతాయి. ఒక్కో వన్డేకు రూ. 6 లక్షలు, ఒక్కో టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు అందజేస్తారు.

కొత్త కాంట్రాక్ట్‌ల జాబితా
గ్రేడ్‌ ‘ఎ’ (రూ. 2 కోట్లు): విరాట్‌ కోహ్లి, ధోని, అశ్విన్, అజింక్య రహానే, చతేశ్వర్‌ పుజారా, మురళీ విజయ్, రవీంద్ర జడేజా.
 
గ్రేడ్‌ ‘బి’ (రూ. 1 కోటి): రోహిత్‌ శర్మ, భువనేశ్వర్, మొహమ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, యువరాజ్‌ సింగ్, కేఎల్‌ రాహుల్‌ (ప్రమోషన్‌), వృద్ధిమాన్‌ సాహా (ప్రమోషన్‌).

గ్రేడ్‌ ‘సి’ (రూ. 50 లక్షలు): శిఖర్‌ ధావన్‌ (దిగువకు), అంబటి తిరుపతి రాయుడు (దిగువకు), అమిత్‌ మిశ్రా, మనీశ్‌ పాండే, అక్షర్‌ పటేల్, కరుణ్‌ నాయర్, హార్దిక్‌ పాండ్యా, ఆశిష్‌ నెహ్రా, కేదార్‌ జాదవ్, యజువేంద్ర చహల్, పార్థివ్‌ పటేల్, జయంత్‌ యాదవ్, మన్‌దీప్‌ సింగ్, ధావల్‌ కులకర్ణి, శార్దుల్‌ ఠాకూర్, రిషభ్‌ పంత్‌ (వీరిలో మిశ్రా, అక్షర్, ధావల్‌ గత ఏడాది కూడా ‘సి’లోనే ఉండగా మిగతా 11 మందికి తొలిసారి కాంట్రాక్ట్‌ లభించింది)

స్థానం కోల్పోయినవారు: సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్, స్టువర్ట్‌ బిన్నీ, మోహిత్‌ శర్మ, వరుణ్‌ ఆరోన్, కరణ్‌ శర్మ, శ్రీనాథ్‌ అరవింద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement