డే నైట్ టెస్ట్ మ్యాచ్ (ప్రతీకాత్మక చిత్రం)
సిడ్నీ : ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తమకు డే నైట్ టెస్టు ఆడే ఉద్దేశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఏకు బీసీసీఐ లేఖ రాసింది. ఈ లేఖకు స్పందించిన సీఏ ‘‘ బీసీసీఐ నుంచి మాకు లేఖ అందిన విషయం వాస్తవమే. డే నైట్ టెస్టు కోసం మేం చేసిన ప్రతిపాదనకు వారు సిద్దంగా లేరని పేర్కొన్నారు. టెస్ట్ క్రికెట్ ప్రభావం కోల్పోకుండా, స్వదేశీ గడ్డపై వేసవిలో ఆసీస్ ఆడే టెస్ట్ సిరీస్‌లో కనీసం ఒక్క టెస్ట్ అయినా డే/టెస్ట్ ఆడించాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా బ్రిస్బెన్ మైదానం గబ్బా వేదికగా జనవరిలో శ్రీలంకతో డేనైట్ టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహిస్తామని’ సీఏ చీఫ్ సదర్లాండ్ తెలిపారు. భారత పర్యటన అనంతర శ్రీలంక ఆసీస్‌లో పర్యటించనుంది.
ఆస్ట్రేలియా కొన్నేళ్లుగా తమ దేశానికి వస్తున్న జట్లతో ఒక టెస్టును డే నైట్‌గా ఆడుతోంది. ఇందులో భాగంగా డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో ప్రారంభం కానున్న సిరీస్‌లోని తొలి టెస్టును గులాబీ బంతితో ఆడదామని భారత్‌కు ప్రతిపాదించింది. అయితే, గులాబీ బంతితో ఆడాలంటే కనీసం ఏడాదిన్నర సన్నాహకం ఉండాలంటూ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలోని జట్టు మేనేజ్‌మెంట్ దీనిని వ్యతిరేకించడంతో బీసీసీఐ విముఖత వ్యక్తం చేసింది. ఇలా ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో ఆడిన టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా ఓడిపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment