James Sutherland
-
క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో రాజీనామా
మెల్బోర్న్: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్(52) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ఆయన ప్రకటించారు. ఈ మేరకు సీఏ బోర్డు, చైర్మన్‌కు ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. గత 17 ఏళ్లుగా క్రికెట్ ఆస్ట్రేలియాకు సీఈవోగా ఆయన కొనసాగుతున్నారు. ‘సుమారు 20 ఏళ్లుగా క్రికెట్ ఆస్ట్రేలియాకు సేవలందిస్తున్నా. గుడ్‌బై చెప్పటానికి ఇదే సరైన సమయం. నేను తీసుకున్న ఈ నిర్ణయం నాకు, క్రికెట్ ఆస్ట్రేలియాకు మంచిదని భావిస్తున్నా’ అంటూ ఈ ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ సెర్చ్ ఎజెన్సీ(ESA) ద్వారా నూతన సీఈవో నియామకం చేపట్టనున్నట్లు సీఏ ప్రకటించింది. అయితే కొత్తవారిని నియమించే వరకు ఆ పదవిలో కొనసాగాలని సీఏ సదర్లాండ్కు కోరినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. కాగా, 1998లో సీఏలో సభ్యుడిగా తన ప్రస్థానం కొనసాగించిన జేమ్స్ సదర్లాండ్, 2001 నుంచి సీఈవోగా కొనసాగుతున్నారు. ఆయన హయాంలో సీఏలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. బోర్డు రెవెన్యూ గణనీయంగా పెరిగిపోయింది. అయితే తర్వాతి కాలంలో అదే స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి కూడా. సెలక్షన్ కమిటీ నిర్ణయాల్లో ఆయన జోక్యం ఎక్కువైందని, ముఖ్యంగా బిగ్ బాష్ లీగ్ టోర్నీల్లో లాబీయింగ్‌లు చేశారని ఆయనపై ఆరోపణలు వినిపించాయి. దీనికి తోడు ఈ మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కుంటున్న జేమ్స్ సదర్లాండ్.. రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. -
‘భారత్ కాకపోతే శ్రీలంకతో ఆడుతాం’
సిడ్నీ : ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తమకు డే నైట్ టెస్టు ఆడే ఉద్దేశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఏకు బీసీసీఐ లేఖ రాసింది. ఈ లేఖకు స్పందించిన సీఏ ‘‘ బీసీసీఐ నుంచి మాకు లేఖ అందిన విషయం వాస్తవమే. డే నైట్ టెస్టు కోసం మేం చేసిన ప్రతిపాదనకు వారు సిద్దంగా లేరని పేర్కొన్నారు. టెస్ట్ క్రికెట్ ప్రభావం కోల్పోకుండా, స్వదేశీ గడ్డపై వేసవిలో ఆసీస్ ఆడే టెస్ట్ సిరీస్‌లో కనీసం ఒక్క టెస్ట్ అయినా డే/టెస్ట్ ఆడించాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా బ్రిస్బెన్ మైదానం గబ్బా వేదికగా జనవరిలో శ్రీలంకతో డేనైట్ టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహిస్తామని’ సీఏ చీఫ్ సదర్లాండ్ తెలిపారు. భారత పర్యటన అనంతర శ్రీలంక ఆసీస్‌లో పర్యటించనుంది. ఆస్ట్రేలియా కొన్నేళ్లుగా తమ దేశానికి వస్తున్న జట్లతో ఒక టెస్టును డే నైట్‌గా ఆడుతోంది. ఇందులో భాగంగా డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో ప్రారంభం కానున్న సిరీస్‌లోని తొలి టెస్టును గులాబీ బంతితో ఆడదామని భారత్‌కు ప్రతిపాదించింది. అయితే, గులాబీ బంతితో ఆడాలంటే కనీసం ఏడాదిన్నర సన్నాహకం ఉండాలంటూ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలోని జట్టు మేనేజ్మెంట్ దీనిని వ్యతిరేకించడంతో బీసీసీఐ విముఖత వ్యక్తం చేసింది. ఇలా ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో ఆడిన టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా ఓడిపోలేదు. -
బీసీసీఐని బుజ్జగిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా
సిడ్నీ : ఈ ఏడాది భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌లో డే నైట్ టెస్ట్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఆస్ట్రేలియా అంతర్జాతీయ మ్యాచ్ వేదికల తేదీలను సీఏ విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్, బోర్డు అధికారులు అడిలైడ్ వేదికగా జరిగే భారత్-ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ను డేనైట్ నిర్వహించే దిశగా బీసీసీఐతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ‘ భారత్ తో అడిలైడ్ వేదికగా జరిగే టెస్టును డే నైట్ నిర్వహించాలని మేం భావిస్తున్నాం. ఆ దిశగా మా ప్రయత్నాలు చేపట్టాం. మరి కొద్ది రోజుల్లో ఈ విషయం స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాం.’ అని జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. ఇక భారత్‌తో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో అడిలైడ్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి 10 మధ్య జరగనుంది. ఇప్పటికే అడిలైడ్ మైదానం గత మూడేళ్లుగా నాలుగు డే నైట్ టెస్టు మ్యాచ్(న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్)లకు ఆతిథ్యం ఇచ్చింది. అదే విధంగా కొత్త క్యాలెండర్లో లైట్స్ కింద భారత్‌తో మరో మ్యాచ్‌కు వేదిక కావాలని సీఏ భావిస్తోంది. భవిష్యత్తు డే నైట్ టెస్ట్ క్రికెట్దేనని క్రికెట్ఆస్ట్రేలియా గట్టిగా నమ్ముతోంది. దీంతోనే ఈ ఫార్మట్‌ను రక్షించవచ్చని, టెలివిజన్ రేటింగ్స్, ప్రేక్షక ఆదరణను పొందవచ్చిన భావిస్తోంది. 2018 నవంబరు 21 నుంచి 2019 జనవరి 18 వరకు భారత్-ఆసీస్ మధ్య టీ20, టెస్టు, వన్డే సిరీస్‌లు జరగనున్నట్లు పేర్కొంది. ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య ఆసీస్‌తో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. పర్యటనలో టీ20 సిరీస్‌తో భారత్ తన పర్యటనను ప్రారంభించనుంది. భారత్‌తో జరిగే మూడు సిరీస్‌లకు బాల్ ట్యాంపరింగ్‌తో నిషేదం ఎదుర్కొంటున్న ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాప్ట్ అందుబాటులో ఉండటం లేదు. భారత్ ఆస్ట్రేలియా షెడ్యూల్: తొలి టీ20: నవంబరు 21- గబ్బా రెండో టీ20: నవంబరు 23- మెల్బోర్న్ మూడో టీ20: నవంబరు 25- సిడ్నీ తొలి టెస్టు: డిసెంబరు 6-10 - ఆడిలైట్ రెండో టెస్టు: డిసెంబరు 14-18 - పెర్త్ మూడో టెస్టు: డిసెంబరు 26-30 - మెల్బోర్న్(బాక్సింగ్ డే టెస్టు) నాలుగో టెస్టు: జనవరి 3- సిడ్నీ మొదటి వన్డే: జనవరి 12- సిడ్నీ రెండో వన్డే: జనవరి 15- ఆడిలైట్ మూడో వన్డే: జనవరి 18- మెల్బోర్న్ -
కోహ్లికి 'సారీ' తెలియదేమో..
ధర్మశాల: ఆస్ట్టేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ డ్రెస్సింగ్ రూమ్ వివాదం చోటు చేసుకుని ఇప్పటికి చాలా రోజులే అయ్యింది. ఆ ఘటన తరువాత ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునేందుకు సిద్ధ పడగా దానికి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మాత్రం దాన్ని ఏదొక రూపంలో బయటకు తీస్తూనే ఉంది. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ డీఆర్ఎస్ వివాదానికి తెరలేపితే, భారత కెప్టెన్ కోహ్లిని దోషిగా చిత్రీకరించేందుకు సీఏ ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా విరాట్ కోహ్లిపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించడమే ఇందుకు ఉదాహరణ. అసలు విరాట్ కోహ్లికి 'సారీ' అనే పదాన్ని ఉచ్చరించడం తెలియదేమో అంటూ తన అసహనాన్ని ప్రదర్శించి మరీ మరోసారి వివాదానికి ఆజ్యం పోసే యత్నం చేశాడు సదర్లాండ్. ప్రధానంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను చీటర్ అంటూ కోహ్లి వ్యాఖ్యానించడాన్ని సదర్లాండ్ తప్పుబట్టాడు. ఒక దేశ కెప్టెన్‌ను మోసగాడు అంటూ వ్యాఖ్యానించిన కోహ్లికి సారీ అనే పదం ఉందనే విషయం తెలియకపోవచ్చంటూ ఎద్దేవా చేశాడు. -
డే అండ్నైట్గా యాషెస్ సిరీస్
సిడ్నీ: వచ్చే ఏడాది ఆసీస్‌లో జరిగే యాషెస్ సిరీస్‌ను డే అండ్ నైట్‌గా మార్చే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. అయితే ఈ విషయంలో ఇంకా ఇంగ్లండ్ బోర్డుతో మాట్లాడలేదని చెప్పారు. అలాగే తమ దేశంలో పర్యటించే పాక్, దక్షిణాఫ్రికా జట్లతో కూడా ఇదే విధంగా ఆడేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. -
'క్లార్క్ కు రిటైర్మెంట్ చిన్న విషయం'
మెల్ బోర్న్: యాషెస్ సిరీస్ కోల్పోయినంత మాత్రానా మైఖేల్ క్లార్క్ ను తక్కువగా చూడబోమని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ అన్నారు. ఈ సిరీస్ తోనే క్లార్క్ క్రీడా జీవితానికి ముగిసిపోదని పేర్కొన్నారు. మైదానంలో అతడు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ఆటతీరును భవిష్యత్ లో స్మరించుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. అతడి తరంలో గొప్ప బ్యాట్స్ మెన్ గా వెలిగొందిన వారిలో క్లార్క్ ఒకడని కొనియాడారు. రోజురోజుకు రాటుదేలిన క్లార్క్ గొప్ప క్రికెటర్ గా ఎదిగాడని, కెరీర్ లో రిటైర్మెంట్ చిన్న విషయమని జేమ్స్ సదర్లాండ్ పేర్కొన్నారు. 34 క్లార్క్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు శనివారం ప్రకటించాడు. ఇంగ్లండ్ చేతిలో తమ జట్టు ఘోరంగా ఓడిపోవడంతో అతడీ నిర్ణయం తీసుకున్నారు. ఈ సిరీస్ 8 ఇన్నింగ్స్ లో క్లార్క్ 117 పరుగులు మాత్రమే చేశాడు.