కోహ్లికి 'సారీ' తెలియదేమో..
ధర్మశాల: ఆస్ట్టేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ డ్రెస్సింగ్ రూమ్ వివాదం చోటు చేసుకుని ఇప్పటికి చాలా రోజులే అయ్యింది. ఆ ఘటన తరువాత ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునేందుకు సిద్ధ పడగా దానికి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మాత్రం దాన్ని ఏదొక రూపంలో బయటకు తీస్తూనే ఉంది. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ డీఆర్ఎస్ వివాదానికి తెరలేపితే, భారత కెప్టెన్ కోహ్లిని దోషిగా చిత్రీకరించేందుకు సీఏ ప్రయత్నిస్తూనే ఉంది.
తాజాగా విరాట్ కోహ్లిపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించడమే ఇందుకు ఉదాహరణ. అసలు విరాట్ కోహ్లికి 'సారీ' అనే పదాన్ని ఉచ్చరించడం తెలియదేమో అంటూ తన అసహనాన్ని ప్రదర్శించి మరీ మరోసారి వివాదానికి ఆజ్యం పోసే యత్నం చేశాడు సదర్లాండ్. ప్రధానంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను చీటర్ అంటూ కోహ్లి వ్యాఖ్యానించడాన్ని సదర్లాండ్ తప్పుబట్టాడు. ఒక దేశ కెప్టెన్ను మోసగాడు అంటూ వ్యాఖ్యానించిన కోహ్లికి సారీ అనే పదం ఉందనే విషయం తెలియకపోవచ్చంటూ ఎద్దేవా చేశాడు.