నిషాకోరి కొత్త చరిత్ర
రియో డీ జనీరో:రియో ఒలింపిక్సలో జపాన్ టెన్నిస్ క్రీడాకారుడు కియో నిషాకోరీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్ లో భాగంగా కాంస్య పతక పోరులో నిషాకోరీ 6-2, 6-7(1), 6-3 తేడాతో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్పై సంచలన విజయం సాధించాడు. దీంతో 1920 తరువాత పురుషుల సింగిల్స్ లో ఒలింపిక్స్ పతకం సాధించిన జపాన్ క్రీడాకారుడిగా నిషాకోరీ నిలిచాడు.
ఈ మ్యాచ్ లో తొలి సెట్ను అవలీలగా గెలిచిన నిషాకోరీ.. రెండో సెట్లో మాత్రం నాదల్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. కాగా, టై బ్రేక్కు దారి తీసిన ఆ సెట్ను నిషాకోరీ కోల్పోయాడు. దీంతో నిర్ణయాత్మక మూడో సెట్లో తిరిగి పుంజుకున్న నిషాకోరీ ఆ సెట్ను సునాయాసంగా గెలిచాడు. దీంతో ఒలింపిక్స్ లో మరోసారి పతకం సాధించాలనుకున్న నాదల్ ఆశలకు బ్రేక్ పడింది. 2008 ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన నాదల్.. 2012 లండన్ ఒలింపిక్స్కు దూరమయ్యాడు.
మరోవైపు బ్రిటన్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రే స్వర్ణాన్ని సాధించాడు. తుదిపోరులో ముర్రే 7-5, 4-6, 6-3, 7-5 తేడాతో డెల్ పాట్రో(అర్జెంటీనా)పై గెలిచి వరుసగా రెండోసారి ఒలింపిక్స్ లో పసిడిని కైవసం చేసుకున్నాడు. గత లండన్ ఒలింపిక్స్ లో ముర్రే స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.