
జపాన్ స్టార్ షట్లర్ మొమోటాపై వేటు
► జూదం ఆడినందుకు నిషేధం
► రియో ఒలింపిక్స్‌కు దూరం
టోక్యో: ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో పతకం తెస్తాడని ఆశలు పెట్టుకున్న జపాన్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కెంటో మొమోటాపై వేటు పడింది. కేసినోలో చట్టవ్యతిరేకంగా జూదం ఆడినందుకు ది నిప్పన్ బ్యాడ్మింటన్ సంఘం అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జాతీయ జట్టులో నుంచి తొలగించింది. పోటీల్లో పాల్గొనకుండా నిరవధిక నిషేధం విధించింది. దాంతో మొమోటా ఈ ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయాడు. జపాన్‌లో జూదంపై కఠిన నిషేధం ఉంది. 21 ఏళ్ల మొమోటా ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు.
గతనెలలో ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో మొమోటా టైటిల్ సాధించాడు. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి జపాన్ తరఫున తొలిసారి పతకం సాధించిన ఆటగాడిగా మొమోటా నిలిచాడు. అలాగే గత డిసెంబర్‌లో జరిగిన సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్ టైటిల్‌ను కూడా జపాన్‌కు తొలిసారిగా అందించాడు.
ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ ముందు జపాన్ బ్యాడ్మింటన్‌కు ఇది గట్టి దెబ్బగానే పరిగణించవచ్చు. మరోవైపు తన తప్పును మొమోటా అంగీకరించడంతో పాటు క్షమించమని వేడుకున్నాడు. ఆరుసార్లు కేసినోలకు వెళ్లి 4500 డాలర్ల మేర బెట్ కాసినట్టు తెలిపాడు. గ్యాంబ్లింగ్‌లో దోషిగా తేలితే జపాన్ చట్ట ప్రకారం గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.