బ్యాడ్మింటన్ ఆరోగ్యానికి విటమిన్
శారీరక ఉల్లాసంతో పాటు మానసిక వినోదానికీ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా రకాల క్రీడలున్నాయి. ముఖ్యంగా బ్యాడ్మింటన్ వయసుతో సంబంధం లేకుండా ఆడే ఆట. చిన్నతనం నుంచే ఈ ఆటను పిల్లలకు నేర్పిస్తుంటారు. దీంతో శారీరకంగానే, మానసికంగా చురుగ్గా ఉండొచ్చు. భారతీయులకు గత రెండు దశాబ్దాల కిందట బ్యాడ్మింటన్‌తో అంతగా పరిచయం లేదు. కానీ ఇటీవల కాలంలో యావత్ దేశ ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయి చూసేటట్టు చేసింది మన తెలుగు క్రీడాకారిణీ పీవీ సింధు. రియో ఒలింపిక్స్‌లో వెండి పతకం సాధించి తన సత్తాను చాటింది. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ ఆటతో ప్రయోజనాలు తెలుసుకుందాం!
- సాక్షి, స్కూల్ ఎడిషన్
సాధారణంగా ఆటలన్నీ మొదట్లో వినోదం కోసం ఆవిర్భవించినవే. అనంతరం శారీరక వ్యాయామంగా కూడా ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. చరిత్రలో బ్యాడ్మింటన్ మూలాలను బ్రిటీష్ ఇండియాలో గమనించవచ్చు. బ్రిటిష్ వారు ఈ క్రీడను భారతదేశంలో ఆడినట్లు పలు ఆధారాలు ఉన్నాయి. సైనికుల శిక్షణలో భాగంగా బ్యాడ్మింటన్‌ను నేర్పించేవారు.
దీంతో శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందవచ్చని అభిప్రాయం నాటి నుంచే ఉంది. తదనంతర కాలంలో బ్యాడ్మింటన్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచంలో ఎక్కువగా ఆడే క్రీడల్లో బ్యాడ్మింటన్ ఒకటి. ఇది వినోదంతోపాటు ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో ఉపకరణాలను అందిస్తుంది.
- సాక్షి, స్కూల్ ఎడిషన్
బరువు తగ్గొచ్చు
బ్యాడ్మింటన్ ఆడేవారిలో గంటకు 480 క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది. ఇంత ఎక్కువ మొత్తం శక్తి ఉపయోగపడేది కేవలం బ్యాడ్మింటన్‌లోనే. నిత్యం నిర్ధిష్ట కాలం కేటాయించి ఇంత శక్తిని ఖర్చు చేస్తే.. బ్యాడ్మింటన్ ఆటతో నెలరోజుల్లో 4 కిలోల బరువు తగ్గవచ్చు. మానవ శరీరంలో ఉన్న అన్ని కండరాలు పనిచేసేంది కూడా ఈ ఆటలోనే. పరిగెత్తేవారిలో కంటే బ్యాడ్మింటన్ ఆడే వారిలో రెట్టింపు శక్తి ఖర్చవుతుంది.
కండరాల దృఢత్వం..
సాధారణంగా కండరాలు గట్టిపడాలంటే జిమ్‌లో డంబెల్ ఉపయోగించి వ్యాయామం చేస్తుంటాం. కాని బ్యాడ్మింటన్ క్రీడతో సులభంగా కండర సామర్థ్యం పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రతి షాట్ ఒక మినీ ఫిగర్ టోనింగ్ అవుతుంది. అంటే భుజవలయం, మోచేతి వలయంలో కదలికలు పెరగడంతో కండరం గట్టిపడుతుంది. ఈ ఆటతో అలిసిపోవడంతో శరీరం కావాల్సినంత నిద్ర తీసుకుంటుంది. దీంతో నిద్ర లేమి సమస్య ఉన్నవారికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. శరీరంలో అన్ని ఎముకలు బ్యాడ్మింటన్‌తో ధృడంగా తయారవుతాయి.
శ్వాసక్రియా రేటునూ..
ఏదైన పని వేగంగా చేసినప్పుడు, పరిగెత్తినప్పుడు సహజంగా అలసట వస్తుంది. అయితే ఈ సమయంలో శ్వాసక్రియా రేటు పెరుగుతుంది. దీంతో ఎక్కువ శక్తి వెంటనే విడుదలవుతుంది. ఈ శక్తిని తక్షణమే ఉపయోగించుకోవచ్చు. బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. దీంతో శ్వాసక్రియా రేటు పెరిగి శక్తి వెంటనే విడుదలవుతుంది. ఇదే శక్తి వెంటనే ఉపయోగించుకోవడంతో ..ఎప్పటికప్పుడు జీవక్రియా సమస్యలు తగ్గిపోయి శరీరం చురుగ్గా పనిచేస్తుంది.
గుండె పనితీరులో...
స్థూలకాయుల హృదయంలోని రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయి రక్త ప్రసరణకు ఇబ్బంది ఏర్పడుతుంది. దీనికి పర్యవసానంగా గుండెకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధులు వచ్చేస్తాయి. దీనికి చికిత్స కేవలం కొవ్వు తగ్గించడమే. ప్రత్యేకంగా గుండెకు శస్త్రచికిత్స నిర్వహించి కొవ్వు తొలగించడంతో ఈ సమస్యకు పరిష్కారం. అయితే బ్యాడ్మింటన్ ఆడే వారిలో గుండె కండరాల్లో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. నిత్యం వ్యాయామంగా ఆడేవారిలో మాత్రం పూర్తిగా కొవ్వు లేకుండా ఉండి రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. గుండె కండరాలు కూడా ధృడంగా ఉంటాయి.
డయాబెటీస్‌కు ఆమడ దూరం..
ఈ రోజుల్లో షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతి పది మందిలో కనీసం ముగ్గురు వ్యక్తులు ఉంటారు. రక్తంలో చక్కెర పరిమాణం పెరగడంతో డయాబెటీస్ వచ్చేస్తుంది. బ్యాడ్మింటన్ వ్యాయామంగా నిత్యం ఆడే వారిలో రక్తంలో షుగర్ పరిమాణం ఎప్పటికప్పుడు తగ్గిపోతుంది. దీంతో శరీరంలో సర్వరోగాలకు కారణమయ్యే డయాబెటీస్‌ను దూరం చేసుకోవచ్చు. రక్తంలో కేవలం షుగర్‌లో పరిమాణం తగ్గిస్తే ఏ ఇతర శరీరానికి నిరోధకత శక్తి పెరుగుతుంది. దీంతో కాలేయ సయస్యలను కూడా దూరం చేయవచ్చు.