చెన్నై: బంతి మెరుపు పెంచేందుకు బౌలర్లు లాలాజలం (ఉమ్ము)కు బదులు చెమటను ఉపయోగించవచ్చని భారత మాజీ పేసర్, మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ సూచించాడు. కరోనా నేపథ్యంలో కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ కమిటీ బంతి షైనింగ్‌కు లాలాజలం వాడటాన్ని నిషేధించింది. దీంతో కృత్రిమ పదార్థం వాడే వెసులుబాటు ఇవ్వాలని ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దీనిపై శ్రీనాథ్ మాట్లాడుతూ ‘ఉమ్ముకు ప్రత్యామ్నాయంగా చెమటను వినియోగించవచ్చు. నిజానికి ఆటలో లాలాజలానికంటే చెమటనే ఎక్కువగా ఉపయోగిస్తాం. కాబట్టి ఉమ్ము వద్దన్నంత మాత్రాన అదో సమస్య కాదు. తరచూ చేతితో ఉమ్మును అందుకొని బంతికి రాయడమనేది అలవాటైంది. ఇప్పుడు దీన్ని మార్చుకుంటే సరిపోతుంది. కొత్త మార్గదర్శకాలను పాటించాలి. లాలాజలానికి బదులుగా చెమట రాయడాన్నే అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో దీని పాత్రే కీలకమవుతుంది’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment