అ 'ద్వితీయం' | Javelin thrower Devendra Jhajharia wins gold at | Sakshi
Sakshi News home page

అ 'ద్వితీయం'

Published Thu, Sep 15 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

అ 'ద్వితీయం'

అ 'ద్వితీయం'

జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డుతోపాటు అగ్రస్థానం
 ఒలింపిక్స్ చరిత్రలో రెండు స్వర్ణాలు
 నెగ్గిన తొలి భారతీయుడిగా గుర్తింపు

 
 ‘రియో’లో భారత జాతీయ గీతం మళ్లీ వినిపించింది. మువ్వన్నెల పతాకం పైపైకి ఎగిరింది. మూడు వారాల క్రితం రియోలోనే ముగిసిన ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో పసిడి పతకం లేని లోటును తీర్చుతూ... అదే వేదికపై జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో స్వర్ణం లభించింది. ఎఫ్-46 జావెలిన్ త్రో ఈవెంట్‌లో 35 ఏళ్ల దేవేంద్ర జజరియా తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలోనే రెండు వ్యక్తిగత స్వర్ణ పతకాలు సాధించిన ఏకై క భారతీయ క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. 2004 ఏథెన్‌‌స ఒలింపిక్స్‌లోనూ దేవేంద్ర ఇదే ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. 12 ఏళ్ల తర్వాత అదే ఫలితాన్ని పునరావృతం చేసి ఔరా అనిపించాడు.

 
 రియో డి జనీరో: భారత క్రీడాభిమానులకు రియో నుంచి మరో ‘బంగారం’లాంటి శుభవార్త అందింది. పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల ఎఫ్-46 జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత అథ్లెట్ దేవేంద్ర జజరియా పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. రాజస్తాన్‌కు చెందిన 35 ఏళ్ల దేవేంద్ర ఈటెను 63.97 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. దాంతో రియో పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య నాలుగుకు చేరింది.
 
 పురుషుల హైజంప్‌లో తంగవేలు మరియప్పన్ స్వర్ణం, వరుణ్ సింగ్ కాంస్యం నెగ్గగా... మహిళల షాట్‌పుట్‌లో దీపా మలిక్ రజత పతకాన్ని గెల్చుకున్న సంగతి విదితమే.  12 ఏళ్ల క్రితం 2004 ఏథెన్‌‌స ఒలింపిక్స్‌లో దేవేంద్ర 62.15 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకాన్ని సాధించాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో దేవేంద్ర ఈవెంట్ లేకపోవడంతో అతను పాల్గొనలేకపోయాడు. రియోలో మళ్లీ అతని ఈవెంట్‌ను చేర్చడంతో దేవేంద్ర రెండోసారీ బంగారు పతకాన్ని నెగ్గి అద్వితీయ ఘట్టాన్ని లిఖించాడు. మొత్తం 13 మంది పాల్గొన్న ఫైనల్స్‌లో అందరికీ ఆరుసార్లు ఈటెను విసిరే అవకాశం లభించింది.
 
భారత్ నుంచి దేవేంద్రతోపాటు రింకూ హుడా, సుందర్‌సింగ్ గుర్జర్ పాల్గొన్నారు. రింకూ హుడాకు (54.39 మీటర్లు) ఐదో స్థానం లభించగా... సుందర్ సింగ్ మాత్రం వైదొలిగాడు. చున్‌లియాంగ్ గువో (చైనా-59.93 మీటర్లు) రజతం గెలుపొందగా... ముదియన్సెల్ హెరాత్ (శ్రీలంక-58.23 మీటర్లు) కాంస్యం సాధించాడు.
 
 దేవేంద్ర తొలి ప్రయత్నంలో ఈటెను 57.25 మీటర్లు,  రెండో ప్రయత్నంలో 60.70 మీటర్లు విసిరాడు. మూడో ప్రయత్నంలో 63.97 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత మూడు ప్రయత్నాల్లో అతను వరుసగా 57.35 మీ., 59.99 మీ., 61.61 మీటర్ల దూరం విసిరాడు. ఈ ఆరింటిలో అత్యధిక దూరమైన 63.97 మీటర్లకు దేవేంద్రకు పసిడి పతకం ఖాయమైంది. 2013 అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ఆధ్వర్యంలో ఫ్రాన్‌‌సలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లోనూ దేవేంద్రకు స్వర్ణం లభించడం విశేషం.
 
 
 ఓవరాల్‌గా పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు లభించిన పసిడి పతకాలు. దేవేంద్ర రెండు స్వర్ణాలు సాధించగా... మురళీకాంత్ పేట్కర్ (1972 హిడెల్‌బర్గ్-స్విమ్మింగ్), తంగవేలు మరియప్పన్ (2016 రియో-అథ్లెటిక్స్) ఒక్కో బంగారు పతకాన్ని గెలిచారు. మొత్తంగా ఈ క్రీడల చరిత్రలో భారత్‌కు 12 పతకాలు లభించారుు. ఇందులో నాలుగు రజతాలు, నాలుగు కాంస్యాలున్నాయి.
 
 ఒకే పారాలింపిక్స్‌లో అత్యధికంగా నాలుగు పతకాలు నెగ్గడం  భారత్‌కిది రెండోసారి. 1984 స్టోక్ మాండివిలి-న్యూయార్క్‌క్రీడల్లోనూ భారత్‌కు నాలుగు పతకాలు వచ్చారుు.
 
 ‘సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. 12 ఏళ్ల తర్వాత మళ్లీ నా రికార్డును నేనే బ్రేక్ చేసుకోవడం గర్వంగా ఉంది. ఫిన్లాండ్‌లో రోజుకు ఏడు గంటల పాటు శిక్షణలో పాల్గొన్నాను. నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. పారాలింపిక్స్ గురించి ప్రజల్లో పెద్దగా అవగాహన లేదు. ఈసారి భారత్‌కు వచ్చిన పతకాల తర్వాత ఈ క్రీడలకు కూడా ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నాను. భవిష్యత్ గురించి ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవు. కానీ నా అనుభవాన్ని దేశంలోని చిన్నారులకు అందిస్తాను.’     - దేవేంద్ర
 
 దేవేంద్ర జజరియాపై ప్రశంసల వర్షం కురిసింది. ప్రధాని దగ్గరి నుంచి సాధారణ పౌరుడి దాకా పలువురు సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 ‘పారాలింపిక్స్ చరిత్రలో రెండు స్వర్ణాలు గెలిచిన దేవేంద్రకు అభినందనలు. నీ విజయం పట్ల మేమంతా గర్విస్తున్నాం’   
 - ప్రధాని నరేంద్ర మోదీ
 
 ‘జజరియా యావత్ జాతి గర్వించే విజయాన్నిచ్చాడు. భారత్‌కు చిరస్మరణీయ పతకాన్ని అందించాడు’
 - కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ

 ‘దేవేంద్ర అంకితభావం అద్భుతం. అసాధారణ ప్రదర్శనతో పసిడి పతకం నెగ్గాడు. దేశంలోని యువతకు ప్రేరణగా నిలిచాడు’     
 - కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement