జయరామ్ జయహో
డచ్ ఓపెన్ టైటిల్ సొంతం
అల్మీర్ (నెదర్లాండ్స్): చాన్నాళ్లకు స్థాయికి తగ్గట్టు రాణించిన భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు అజయ్ జయరామ్ కెరీర్‌లో తొలి గ్రాండ్‌ప్రి టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆదివారం ముగిసిన డచ్ ఓపెన్‌లో అజయ్ జయరామ్ విజేతగా నిలిచాడు. 46 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రపంచ 66వ ర్యాంకర్ జయరామ్ 10-11, 11-6, 11-7, 1-11, 11-9తో ఎహ్‌సాన్ మౌలానా ముస్తఫా (ఇండోనేసియా)పై గెలిచాడు. టైటిల్ నెగ్గిన జయరామ్‌కు 3,750 డాలర్ల (రూ. 2 లక్షల 30 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 82 ఏళ్ల చరిత్ర కలిగిన డచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన మూడో భారతీయ క్రీడాకారుడిగా జయరామ్ గుర్తింపు పొందాడు. గతంలో చేతన్ ఆనంద్ (2009), ప్రకాశ్ పదుకొనే (1982) ఈ టైటిల్‌ను సాధించారు. ముంబైకి చెందిన 27 ఏళ్ల జయరామ్ బెంగళూరులో కోచ్‌లు విమల్ కుమార్, టామ్ జాన్ వద్ద శిక్షణ పొందుతున్నాడు.