‘జేకే బోస్’ విజేత నార్త్‌జోన్ | 'JK Bose, the winner of the North | Sakshi
Sakshi News home page

‘జేకే బోస్’ విజేత నార్త్‌జోన్

Published Sun, Jun 8 2014 1:31 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

'JK Bose, the winner of the North

సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఎస్‌జేఎఫ్‌ఐ-జేకే బోస్ టి20 టోర్నమెంట్ టైటిల్‌ను నార్త్‌జోన్ జట్టు గెలుచుకుంది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం జరిగిన ఆఖరిదైన మూడో రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో నార్త్ 46 పరుగుల తేడాతో సౌత్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నార్త్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 179 పరుగులు చేసింది. అమిత్ చౌదరి (91 నాటౌట్) చెలరేగితే, సిద్ధార్థ్ శర్మ (51), ఆకాశ్ రావల్ (31 నాటౌట్) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులకే పరిమితమైంది. సతీష్ విశ్వనాథన్ (43) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఆకాశ్ రావల్, సుధీర్ ఉపాధ్యాయ, అమిత్ చౌదరి తలా రెండు వికెట్లు తీశారు.
 
 టోర్నీలో రెండు విజయాలు సాధించిన సౌత్ జట్టు చివరి మ్యాచ్‌లో ఓడిపోయినా కనీసం 150 పరుగులు చేసి ఉంటే మెరుగైన రన్‌రేట్‌తో టైటిల్ గెలిచేది. జింఖానాలో జరిగిన మరో మ్యాచ్‌లో వెస్ట్‌జోన్ 6 వికెట్ల తేడాతో ఈస్ట్‌జోన్‌ను ఓడించింది. ముందుగా ఈస్ట్‌జోన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 128 పరుగులు చేసింది. షేక్ ఫైజల్ అలీ (32), అబ్దుల్ అజీ (57 నాటౌట్) మెరుగ్గా ఆడారు. క్రిస్టీ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌జోన్ 18 ఓవర్లలో 4 వికెట్లకు 131 పరుగులు చేసి నెగ్గింది. సుభోద్ మయూర్ (36) ఫర్వాలేదనిపించాడు. వెస్ట్, ఈస్ట్‌లకు వరుసగా మూడు, నాలుగు స్థానాలు దక్కాయి.
 
 ముంబై క్లీన్‌స్వీప్
 టేబుల్ టెన్నిస్ టోర్నీలో స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ముంబై (ఎస్‌జేఏఎమ్) మూడు టైటిల్స్ నెగ్గి క్లీన్‌స్వీప్ చేసింది. సింగిల్స్‌లో అమోల్ కరాడ్కర్ (ముంబై) 11-5, 11-6, 6-11, 9-11, 11-7తో ఆర్. కౌశిక్ (బెంగళూరు)పై; డబుల్స్‌లో అమోల్-అశ్విన్ 11-7, 11-4, 11-9తో కీర్తివాసన్-భగవతి (తమిళనాడు)పై నెగ్గారు. టీమ్ ఈవెంట్‌లో ఎస్‌జేఏఎమ్-ఎ 2-1తో ఎస్‌డబ్ల్యుఏబీ-ఎపై గెలిచింది. ఫుట్‌బాల్ పెనాల్టీ కిక్స్‌లో ముంబై-ఎ 2-1తో ఒరిస్సా-ఎపై; బాస్కెట్‌బాల్ ఫ్రీ త్రోస్‌లో ఎస్‌డబ్యుబీ 2-1తో టీఎన్‌ఎస్‌జేఏ-ఎపై నెగ్గాయి. విజేతలకు చెస్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ బహుమతులను అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement