లండన్: ‘బయో సెక్యూరిటీ’ నిబంధనలు ఉల్లంఘించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆగ్రహానికి గురైన పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు ఊరట లభించింది. ఆర్చర్ గత ప్రవర్తనను దృష్టిలో ఉంచుకొని ఈ సారికి జరిమానాతో సరి పెట్టాలని ఈసీబీ నిర్ణయించింది. ఆర్చర్ తన తప్పును అంగీకరించడంతో మూడో టెస్టు కోసం అతడిని జట్టులోకి ఎంపిక చేసింది. తొలి టెస్టు ముగిశాక సౌతాంప్టన్‌నుంచి రెండో టెస్టు వేదిక మాంచెస్టర్‌కు వెళ్లే సమయంలో ఆర్చర్ దారిలోనే ఉన్న తన ఇంటికి వెళ్లొచ్చాడు. ఇలా రక్షణ వలయాన్ని దాటడంపై ఆగ్రహించిన ఈసీబీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ వెంటనే అతడిని రెండో టెస్టు నుంచి తప్పించింది. ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించింది.
ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ శుక్రవారం చేపట్టిన విచారణలో ఇంగ్లండ్ ప్లేయర్ల సంఘం ప్రతినిధి, ఆర్చర్ ఏజెంట్ పాల్గొన్నారు. గట్టి హెచ్చరికతో పాటు జరిమానా విధించామని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే జరిమానా ఎంతనేది మాత్రం ఈసీబీ అధికారికంగా వెల్లడించలేదు. ఈ మొత్తం రెండో టెస్టు మ్యాచ్ ఫీజుతో సమానమైన సుమారు 15వేల పౌండ్లు (రూ. 14 లక్షలు) కావచ్చని సమాచారం. ఇప్పటికే ఒక కోవిడ్ పరీక్షకు ఆర్చర్ హాజరు కాగా, రిపోర్ట్ నెగెటి వ్‌గా వచ్చింది. రెండో పరీక్షలో కూడా ఇదే ఫలితం వస్తే అతను మంగళవారం జట్టుతో చేరతాడు.
Comments
Please login to add a commentAdd a comment