బీబీఎల్ లో మిచెల్ అరంగేట్రం!
పెర్త్: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ తొలిసారి బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో అరంగేట్రానికి రంగం సిద్దం చేసుకున్నాడు. ఈ మేరకు 2016-17 సీజన్ లో భాగంగా పెర్త్ స్కార్చర్స్తో ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పటివరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడిన జాన్సన్.. వచ్చే బిగ్ బాష్ లీగ్ లో తొలిసారి రంగ ప్రవేశం చేయబోతున్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న అనంతరం బిగ్ బాష్ లో ఆడే అవకాశాన్ని వదులుకున్నాడు. ఆ సమయంలో కుటుంబానికి చేరువుగా ఉండాలని భావించిన మిచెల్.. బిగ్ బాష్ లో ఆడేందుకు నిరాకరించాడు.
తాను ఎప్పుడూ క్రికెట్ కు మరింత చేరువగా ఉండటానికే ఇష్టపడతానని తెలిపిన జాన్సన్.. ఈ లీగ్ ఆడటానికి ఆతృతగా ఉన్నట్లు పేర్కొన్నాడు. స్వదేశంలో జరిగే బిగ్ బాష్ లీగ్ కు విశేష ఆదరణ తో దూసుకుపోతుందన్నాడు. కొంతమంది ప్రేరణతోనే బీబీఎల్ ఆడటానికి సిద్దమైనట్లు మిచెల్ తెలిపాడు. తాను జట్టుతో పాటు ఉంటూ యువ క్రికెటర్లకు బౌలింగ్ విభాగంలో మెంటర్ గా సేవలందించడానికి సిద్ధమైనట్లు మిచెల్ తెలిపాడు. తాను బౌలింగ్ కోచింగ్ బాధ్యతలు కూడా తీసుకోవడంతో ఆటపై ఎక్కువ దృష్టి నిలిపాల్సిన అవసరం ఉందన్నాడు.