ట్రోఫీతో ఇంగ్లండ్ జట్టు
క్రైస్ట్‌చర్చ్: ఓపెనర్ జానీ బెయిర్ స్టో (60 బం తుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) సూపర్ సెంచరీ సాయంతో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 3–2తో చేజిక్కించుకుంది. శనివారం ఇక్కడ జరిగిన నిర్ణాయక ఐదో వన్డేలో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ కాగా... అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెయిర్ స్టో చెలరేగడంతో ఇంగ్లండ్ 32.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసి గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్‌లో భారీ శతకంతో కివీస్‌ను గెలిపించిన రాస్ టేలర్ ఫిట్‌నెస్ సమస్యలతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఓపెనర్ మున్రో (0) ఖాతా తెరవకుండానే వోక్స్ (3/32)కు చిక్కాడు. ఓ వైపు గప్టిల్ (47; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా... కెప్టెన్ విలియమ్సన్ (14), లాథమ్ (10), చాప్‌మన్ (0) నిరాశపరచడంతో కివీస్ 93 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
ఆ దశలో నికోల్స్ (55; 1 ఫోర్, 1 సిక్స్), సాన్‌ట్నర్ (67; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకోవడంతో చివరకు 223 పరుగులు చేయగలిగింది. ప్రత్యర్థి బౌలర్లలో రషీద్ 3, కరన్ 2 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన ఇంగ్లండ్‌కు బెయిర్ స్టో, హేల్స్ (61; 9 ఫోర్లు) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 20.2 ఓవర్లలో 155 పరుగులు జోడించారు. ఈ క్రమంలో బెయిర్ స్టో 58 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున ఇది మూడో వేగవంతమైన శతకం. అనంతరం ఓపెనర్లతో పాటు మోర్గాన్ (8) వెనుదిరిగినా... జో రూట్ (23 నాటౌట్; 1 ఫోర్), స్టోక్స్ (26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) జట్టును విజయ తీరాలకు చేర్చారు. వోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment