
సిడ్నీ: ఇంగ్లండ్ తో స్వదేశంలో యాషెస్ సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా తమ మాటల యుద్ధానికి మరింత పదునుపెట్టింది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ యాషెస్ లో పాల్గొనకపోవడాన్ని అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న ఆసీస్.. తమ వాడివేడి మాటలతో ప్రత్యర్థి ఇంగ్లిష్ జట్టును భయపెట్టి యత్నం చేస్తోంది. రేపట్నుంచి ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో ఇంగ్లండ్ రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో పాల్గొంటున్న తరుణంలో ఆసీస్ ప్రధాన పేసర్ జోష్ హజల్ వుడ్ పదునైన వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా ఇంగ్లండ్ జట్టు టాపార్డర్ ను కకావికలం చేసి వారికి యాషెస్ కు ముందుగానే బౌలింగ్ లో సత్తాచూపెట్టాలని ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్ కౌల్టర్ నైల్ కు సూచించాడు.
'కౌల్టర్ నైల్..ఇంగ్లండ్ పై రెచ్చిపో. నీ పదునైన బంతులతో వారికి దడపుట్టించు. పర్యాటక జట్టుకు తేరుకునే అవకాశం ఇవ్వకు. తొలుత టాపార్డర్ పని పడితే ఇక వారు గాడిలో పడే అవకాశం ఉండదు. ఇంగ్లండ్ జట్టును బౌలింగ్ తో భయభ్రాంతులకు గురి చేసి పైచేయి సాధించాలి. అది రెండు రోజుల మ్యాచ్ లో కౌల్టర్ చేస్తాడని అనుకుంటున్నా'అని హజల్ వుడ్ పేర్కొన్నాడు. ఈ నెల 23వ తేదీ నుంచి ఆరంభం కానున్న యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తో కలిసి హజల్ వుడ్ ఓపెనింగ్ బౌలింగ్ ను పంచుకునే అవకాశం ఉంది. ఆ ఇద్దరికి జతగా మరో పేసర్ ప్యాట్ కమిన్స్ జట్టుకు అందుబాటులో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment