ఆమ్లా, డుమిని సెంచరీలు
• దక్షిణాఫ్రికా 338/3
• శ్రీలంకతో మూడో టెస్టు
జొహన్నెస్‌బర్గ్: శ్రీలంకతో గురువారం ప్రారంభమైన మూడో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజే దక్షిణాఫ్రికా భారీ స్కోరుతో చెలరేగింది. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న హషీం ఆమ్లా (221 బంతుల్లో 125 బ్యాటింగ్; 16 ఫోర్లు) సెంచరీ సాధించగా, మరో బ్యాట్స్‌మన్ జేపీ డుమిని (221 బంతుల్లో 155; 19 ఫోర్లు) కూడా శతకం అందుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 292 పరుగులు జోడించడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తక్కువ వ్యవధిలో ఓపెనర్లు కుక్ (10), ఎల్గర్ (27) వికెట్లు కోల్పోయింది.
అయితే ఆమ్లా, డుమిని కలిసి లంక బౌలర్లపై చెలరేగారు. ఈ క్రమంలో డుమిని 140 బంతుల్లో కెరీర్‌లో ఆరో సెంచరీని, ఆమ్లా 169 బంతుల్లో కెరీర్‌లో 26వ సెంచరీని అందుకున్నారు. 100వ టెస్టులో సెంచరీ సాధించిన ఎనిమిదో ఆటగాడిగా ఆమ్లా నిలిచాడు. గతంలో కౌడ్రీ, మియాందాద్, గ్రీనిడ్జ్, స్టివార్ట్, ఇంజమామ్, పాంటింగ్ (రెండు ఇన్నింగ్స్‌లలోనూ), గ్రేమ్ స్మిత్ ఈ ఘనత సాధించారు. లహిరు కుమారకు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఆమ్లాతో పాటు ఒలివర్ (0) క్రీజ్‌లో ఉన్నాడు.