జస్టిస్ లోధా కమిటీ నివేదికపై చర్చ
ముంబై: జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదనల అమలుపై చర్చించేందుకు బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) శుక్రవారం జరగనుంది. కమిటీ నివేదికను అమలు చేసే విషయంలో స్పష్టతనిచ్చేందుకు మార్చి 3 వరకు సుప్రీం కోర్టు బోర్డుకు గడువునిచ్చింది. బీసీసీఐలోని అధికారుల గరిష్ట వయస్సు 70 ఏళ్లు, ఒక రాష్ట్రానికి ఒక ఓటుతో పాటు ఆఫీస్ బేరర్లుగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులను దూరంగా ఉంచాలని కమిటీ కీలక ప్రతిపాదనలను చేసిన విషయం తెలిసిందే. ఈ నెలారంభంలో తమ న్యాయ కమిటీ సమావేశం అనంతరం బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఎస్‌జీఎం ఏర్పాటుకు నిర్ణయించారు. దీంట్లోని కొన్ని సూచనలు అమలుకు సాధ్యం కాకుండా ఉన్నాయని, ఇందుకోసం నిపుణుల అభిప్రాయం తీసుకోవాలనే ఆలోచనలో బోర్డు ఉంది. మరోవైపు ఐసీసీ సభ్యదేశాల ఆర్థిక పరిస్థితిపై కూడా ఎస్‌జీఎంలో చర్చించనున్నారు. శ్రీనివాసన్ హయాంలో మూడు దేశాల (భారత్, ఆసీస్, ఇంగ్లండ్)కు ఇచ్చిన సూపర్ పవర్‌ను ప్రస్తుత ఐసీసీ చైర్మన్‌గా ఉన్న శశాంక్ తొలగించారు.
న్యాయ సలహా తీసుకుంటా..: హర్భజన్
వివిధ రాష్ట్ర జట్లకు ‘భజ్జీ స్పోర్ట్స్’ పేరిట కిట్స్‌ను సరఫరా చేస్తున్న హర్భజన్ పరస్పర విరుద్ధ ప్రయోజాలనాలకు పాల్పడుతున్నట్టు బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఏపీ షా తేల్చడంపై న్యాయ సలహా తీసుకుంటానని స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపారు. ‘బోర్డు నుంచి ఈ విషయంలో ఈమెయిల్ అందింది. మా న్యాయ సలహాదారునితో అన్ని విషయాలను చర్చించిన అనంతరం ఎలా ముందుకెళ్లాలనేది ఆలోచిస్తా’ అని హర్భజన్ తెలిపాడు. సామాజిక కార్యకర్త నీరజ్ గుండే లేవనెత్తిన అంశాలపై షా విచారణ చేపట్టారు. మరోవైపు ఈ కంపెనీ భజ్జీ తల్లి అవతార్ కౌర్ పేరిట నడుస్తోంది.
నేడు బీసీసీఐ ఎస్‌జీఎం
Published Fri, Feb 19 2016 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM
Advertisement