జస్టిన్ లాంగర్
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ స్థానాన్ని మరో మాజీ ఆటగాడు భర్తీ చేశాడు. వచ్చే నాలుగేళ్ల కాలానికి కోచ్‌గా జస్టిన్ లాంగర్‌ను నియమిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత పదవి నుంచి తప్పుకున్న డారెన్ లీమన్ స్థానంలో 47 ఏళ్ల లాంగర్‌ను ఎంపిక చేశారు. లీమన్ తప్పుకున్న తర్వాత కోచ్‌గా లాంగర్ పేరు ప్రముఖంగా వినిపించగా... అతని నియామకాన్ని గురువారం అధికారికంగా ఖరారు చేశారు. జూన్ 13 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్ కోచ్‌గా లాంగర్‌కు తొలి పర్యటన కానుంది.
ఆసీస్ జట్టుతో కోచింగ్‌కు సంబంధించి లాంగర్‌కు గతానుభవం ఉంది. టిమ్ నీల్సన్, మికీ ఆర్థర్‌లు కోచ్‌లుగా వ్యవహరించిన సమయంలో అతను సహాయక కోచ్‌గా పని చేశాడు. ఆ తర్వాత వెస్ట్రన్ ఆస్టేలియా, బిగ్‌బాష్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్లకు కూడా కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అతని శిక్షణలో పెర్త్ స్కార్చర్స్ మూడు సార్లు బిగ్‌బాష్ టైటిల్ గెలుచుకోవడం విశేషం. ‘ఆస్ట్రేలియా జట్టుకు కోచ్‌గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా.
క్రికెట్ ప్రపంచం దృష్టిలో మా జట్టుపై గౌరవం పెంచడం కూడా నాకు అన్నింటికంటే ముఖ్యం. రాబోయే రోజుల్లో ఆటపరంగా అనేక సవాళ్లు నా కోసం సిద్ధంగా ఉన్నాయి. అయితే అన్నింటికంటే పెద్దది మాత్రం భారత్‌లో భారత్‌తో సిరీస్ ఆడటమే. అక్కడి ప్రదర్శనపైనే మా జట్టు గొప్పతనం గురించి ఒక అంచనాకు రాగలను. ఎందుకంటే 2004లో అక్కడ సిరీస్ గెలిచిన జట్టులో నేనూ ఉన్నాను. నా కెరీర్‌లో అదే మౌంట్ ఎవరెస్ట్‌లాంటి ఘటన’ అని లాంగర్ వ్యాఖ్యానించాడు.
ఆస్ట్రేలియా తరఫున అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో ఒకడిగా జస్టిన్ లాంగర్‌కు గుర్తింపు ఉంది. కొత్త మిలీనియంలో కంగారూలు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన సమయంలో జట్టులో ఓపెనర్‌గా అతను కీలక పాత్ర పోషించాడు. 14 ఏళ్ల కెరీర్‌లో లాంగర్ 105 టెస్టుల్లో 45.27 సగటుతో 7696 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు ఉన్నాయి. మరో ఓపెనర్ మాథ్యూ హేడెన్‌తో కలిసి ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాలు అందించాడు. హేడెన్–లాంగర్ జంట 113 టెస్టుల్లో కలిపి సంయుక్తంగా 5655 పరుగులు జత చేసి టెస్టు క్రికెట్‌లో గ్రీనిడ్జ్–హేన్స్ (6482) తర్వాత రెండో అత్యుత్తమ ఓపెనింగ్ జోడిగా గుర్తింపు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment