రెండేళ్ల నిరీక్షణ తర్వాత భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ఓ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది.
కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీ
కాల్గారి (కెనడా): రెండేళ్ల నిరీక్షణ తర్వాత భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ఓ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో ఈ ద్వయం టైటిల్ పోరుకు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ జ్వాల-అశ్విని 21-17, 21-16తో షిహో తనకా-కోహర్ యోనెమిటో (జపాన్)లపై నెగ్గారు. ఫైనల్లో జ్వాల-అశ్విని... టాప్‌సీడ్ సెలెనా పీక్-ముస్కెన్స్ (నెదర్లాండ్స్)లతో తలపడతారు.
2013లో చివరిసారి టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన జ్వాల-అశ్విని జంట రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 30 నిమిషాల పాటు జరిగిన సెమీస్‌లో భారత ద్వయం స్థాయికి తగ్గట్టుగా రాణించింది. తొలి గేమ్ ఆరంభంలో కాస్త వెనుకబడినా... 4-4, 6-6తో స్కోరు సమం చేసింది. తర్వాత వరుస పాయింట్లతో 9-6 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే జపాన్ జంట పుంజుకుని 14-14తో తమ అనుభవాన్ని రంగరించి వరుస పాయింట్లతో జ్వాల జంటకు కళ్లెం వేసింది. స్కోరు సమం చేసినా.. జ్వాల జోడీ వరుసగా నాలుగు పాయింట్లతో 18-14 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.