చివరి టెస్టులో కలిస్ సెంచరీ
డర్బన్: సౌతాఫ్రికా దిగ్గజ ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్ (115) తన వీడ్కోలు టెస్టులో సెంచరీతో కదంతొక్కాడు. భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో కలిస్ దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందించాడు. 299/5 ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు లంచ్ సమయానికి ఏడు వికెట్లకు 395 పరుగులు సాధించారు. ప్రస్తుతం 61 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. కాగా లంచ్ తర్వాత వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఒక రోజు ఆటే మిగిలిఉండటంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఓవర్నైట్ బ్యాట్స్మెన్ కలిస్, స్టెయిన్ బాధ్యాతాయుత బ్యాటింగ్తో జట్టుకు ఆధిక్యం అందించారు. ఈ క్రమంలో కలిస్ టెస్టు కెరీర్లో 45వ సెంచరీ నమోదు చేశాడు. తొలి సెషన్ చివర్లో వీరిద్దరూ అవుటయ్యారు. కలిస్ను జడేజా, స్టెయిన్ను జహీర్ పెవిలియన్ చేర్చారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 334 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.