రంజీ ఫైనల్ సందడి షురూ
Published Tue, Jan 28 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల విరామం తర్వాత ఉప్పల్ క్రికెట్ స్టేడియం రంజీ ట్రోఫీ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. కర్ణాటక, మహారాష్ట్ర జట్ల మధ్య ఈ ఐదు రోజుల మ్యాచ్ బుధవారం నుంచి జరుగుతుంది. ఇందు కోసం హెచ్‌సీఏ సన్నాహకాలు పూర్తయ్యాయి. సోమవారం బీసీసీఐ ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ కార్యదర్శి ఇ. వెంకటేశ్వరన్ మైదానాన్ని పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మ్యాచ్ కోసం రెండు పిచ్‌లను సిద్ధం చేశారు.
ఏ వికెట్‌పై ఫైనల్ నిర్వహించాలో మంగళవారం ఉదయం నిర్ణయిస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక జట్లు సోమవారం చెరో రెండు గంటల పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాయి. ఫైనల్ మ్యాచ్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేన్ క్రికెట్ ప్రముఖులందరినీ ఈ మ్యాచ్‌కు ఆహ్వానిస్తోంది. బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ ఈ మ్యాచ్‌కు హాజరు కానున్నారు. సెలక్షన్ కమిటీ సభ్యులు సందీప్ పాటిల్, విక్రమ్ రాథోడ్, రాజీందర్‌సింగ్ హన్స్, రోజర్ బిన్నీ, సబా కరీమ్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకిస్తారు. రంజీ ట్రోఫీ మాజీ ఆటగాళ్లు, మాజీ ఆఫీస్ బేరర్లు, ఇతర అసోసియేషన్ల అధికారులకు హెచ్‌సీఏ ప్రత్యేకంగా ఆహ్వానం అందించింది.
Advertisement
Advertisement