రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా విధర్బతో జరుగుతున్న ఫైనల్లో ముంబై విజయం ముంగిట నిలిచింది. వాంఖడేలో జరుగుతున్న తుది పోరులో ముంబై విదర్భ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 141/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ముంబై.. 418 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో ముషీర్ ఖాన్ మరో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
326 బంతుల్లో 10 ఫోర్లతో ముషీర్ 136 పరుగులు చేశాడు. మరోవైపు భారత ఆటగాడు, ముంబై మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 111 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 95 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 14 నెలల తర్వాత అతడికిది తొలి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.
వీరిద్దరితో పాటు కెప్టెన్ అజింక్య రహానే(73), శామ్స్ ములాని(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబె ఐదు వికెట్లతో చెలరేగగా.. యశ్ ఠాకూర్ 3, ఆదిత్య థాక్రే, అమన్ తలో వికెట్ పడగొట్టారు. మూడో రోజు ఆట ముగిసేసరికి విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ధ్రువ్ షోరె (7), అథర్వ తైడే (3) నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు.
కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. అనంతరం విదర్భ.. ముంబై బౌలర్ల దాటికి 105 పరుగులకే కుప్పకూలింది. తద్వారా ముంబై జట్టుకు 109 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించడంతో ముంబై.. విధర్భకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
Comments
Please login to add a commentAdd a comment