కరుణ్ నాయర్ కొట్టేశాడు!
చెన్నై:ఇంగ్లండ్ తో సుదీర్ఘ సిరీస్లో భాగంగా మూడో టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన కరుణ్ నాయర్.. తన ఆడుతున్న మూడో మ్యాచ్లోనే శతకం సాధించాడు. చివరిదైన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కరుణ్ నాయర్ 185 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఇది నాయర్ కెరీర్లో తొలి టెస్టు సెంచరీ. ఓవర్ నైట్ ఆటగాడిగా ఇన్నింగ్స్ ఆరంభించిన నాయర్ ఆద్యంతం ఆకట్టుకుని సెంచరీతో సత్తా చాటుకున్నాడు. గత రెండు టెస్టుల్లో నాయర్ విఫలమైనా, సెలక్టర్లు మరొకసారి కల్పించిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.
ఈ రోజు ఆటలో భాగంగా 391/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ నిలకడగా బ్యాటింగ్ చేసింది. మురళీ విజయ్ తో కలిసి నాయర్ 63 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో భారత్ ను పటిష్ట స్థితికి చేరింది. అయితే నాయర్ సెంచరీ చేసిన తరువాత మురళీ విజయ్ అవుటయ్యాడు. దాంతో భారత్ జట్టు 435 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది.