అడిలైడ్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమి పాలైన తమ జట్టు తదుపరి మ్యాచ్ లో గాడిలో పడాలంటే కొన్ని మార్పులు అవసరమని ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు. ప్రధానంగా ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ లో మార్పులను పీటర‍్సన్ సూచించాడు. తొలి టెస్టులో ఏ మాత్రం ఆకట్టుకోలేని ఫాస్ట్ బౌలర్ జాక్ బాల్‌ను తీసేయడమే ఉత్తమం అని అభిప్రాయపడ్డాడు. 'అడిలైడ్ ఓవల్‌లో జరిగే రెండో యాషెస్ టెస్టులో జాక్ బాల్ అవసరం లేదు. కీలకమైన రెండో టెస్టులో బాల్‌కు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
జాక్ బాల్ ఆశించిన స్థాయిలో రాణించాడని అనుకుంటున్నారా..నేను చూసినంత వరకూ అయితే అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అతనికి ఛాన్స్ ఇవ్వడం అనవసరం. తదుపరి మ్యాచ్‌కు నేనైతే బాల్‌కు అవకాశం ఇవ్వను'అని పీటర్సన్ పేర్కొన్నాడు. తొలి టెస్టులో జాక్ బాల్ కేవలం వికెట్ మాత్రమే తీయడంతో ఇంగ్లండ్ బౌలింగ్ విభాగంలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఆ బౌలర్‌ను రెండో టెస్టుకు తప్పించాలంటూ ఇంగ్లండ్ యాజమాన్యానికి పీటర్సన్ తెలియజేయడంతో ఇప్పుడు ఆ జట్టును మరింత ఇరకాటంలో నెట్టింది. మరొకవైపు తొలి టెస్టులో ఆల్ రౌండర్ మొయిన్ అలీ గాయపడి రెండో టెస్టుకు దూరం కావడం కూడా ఇంగ్లండ్‌ను కలవరపెడుతోంది. శనివారం నుంచి అడిలైడ్ ఓవల్‌లో రెండో టెస్టు ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment