తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేస్తూ భారత స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ ఈ ఏడాది తొలిసారి ఓ టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. తనకంటే తక్కువ ర్యాంక్ క్రీడాకారుడి చేతిలో వరుస గేముల్లో ఓడిపోయాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు టోర్నీల్లో ఆడిన శ్రీకాంత్ ఇండియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి, మిగతా ఆరు టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని కూడా దాటలేకపోయాడు.
వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో రెండో రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే చేతులెత్తేయగా... సమీర్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మహిళల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రపంచ 51వ ర్యాంకర్ షెసర్ హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 16–21, 20–22తో ఓడిపోయాడు. 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ ఒకదశలో ఆధిక్యంలో ఉండి ఆ తర్వాత వెనుకబడి కోలుకోలేకపోయాడు. రుస్తావిటో చేతిలో శ్రీకాంత్‌కిది రెండో పరాజయం కావడం విశేషం. వీరిద్దరూ ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తలపడగా అప్పుడు కూడా రుస్తావిటో పైచేయి సాధించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–13, 17–21, 21–18తో కజుమసా సకాయ్ (జపాన్)పై గెలుపొందాడు.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సింధు 21–14, 21–7తో సయాక తకహాషి (జపాన్)పై కేవలం 28 నిమిషాల్లో నెగ్గగా... ఏడో సీడ్ సైనా 12–21, 21–11, 21–17తో హాన్ యువె (చైనా)పై శ్రమించి విజయం సాధించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) 13–21, 16–21తో జాంగ్ కొల్ఫాన్–రవింద (థాయ్‌లాండ్) చేతిలో; దండు పూజ–సంజన సంతోష్ (భారత్) 13–21, 21–12, 12–21తో ప్రమోదిక–కవిది (శ్రీలంక) చేతిలో; అపర్ణ బాలన్–శ్రుతి (భారత్) 12–21, 10–21తో యుజియా జిన్–మింగ్ హుయ్ లిమ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ (భారత్) 18–21, 15–21తో హి జిటింగ్–తాన్ కియాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment