పొలార్డ్ పై ప్రశంసలు
ముంబై: గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ముంబై ఇండియన్స్ ఆల్-రౌండర్ కీరన్ పొలార్డ్ ఎట్టకేలకే పుంజుకున్నాడు. ఫామ్ అందుకుని తనదైన శైలిలో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ 17 బంతుల్లో 51 పరుగులు చేసి సత్తా చాటాడు.
ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగొ ఆల్-రౌండర్ ఫామ్ అందుకోవడం పట్ల ముంబై ఇండియన్స్ అసిస్టెంట్ కోచ్ రాబిన్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితం మార్చేసే సత్తా ఉన్న ఆటగాళ్లలో పొలార్డ్ ఒకడని, అతడు గాడిలో పడడం తమ టీమ్‌కు అనుకూలించే అంశమని చెప్పాడు. తనదైన రోజున అతడిని ఆపడం ప్రత్యర్థుల తరం కాదని వ్యాఖ్యానించాడు. అనుభవం పెరిగేకొద్ది అతడి ఆటతీరు మెరుగవుతోందని, ఐపీఎల్‌లో రోజురోజుకు అతడు రాటు దేలుతున్నాడని వివరించాడు. గాయం నుంచి కోలుకుని మైదానంలో అడుగుపెట్టేందుకు పొలార్డ్ చాలా కష్టపడ్డాడని వెల్లడించాడు. అతడి ఫిట్‌నెస్ పూర్తి సంతృప్తిగా ఉన్నామని చెప్పాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడుతూ నాయకత్వ పటిమను నిరూపించుకుంటున్నాడని రాబిన్ తెలిపాడు. తమ జట్టులో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండడంతో అతడు స్వేచ్ఛగా ఆడుతున్నాడని వెల్లడించాడు.