ధోని 3 సిక్స్‌లు బాదాడు.. అయితే ఏంటి?: పొలార్డ్‌ | IPL 2024, MI Vs CSK: MI Batting Coach Kieron Pollard Comments On MS Dhoni Three Sixes In Last 20th Over - Sakshi
Sakshi News home page

ధోని ఒక్కడే కాదు.. అక్కడ ఎవరున్నా సిక్సర్లు కొడతారు: పొలార్డ్‌ కామెంట్స్‌ వైరల్‌

Published Mon, Apr 15 2024 2:28 PM

Yes Dhoni Hit 3 Sixes Vs MI But: Kieron Pollard Stunning Reply Shocks Fans - Sakshi

చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌, టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోని గురించి ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ కీరన్‌ పొలార్డ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆఖరి ఓవర్లో ఎవరైనా హిట్టింగ్‌ ఆడటం సహజమేనని.. అదేమీ గొప్ప విషయం కాదన్నాడు.

ముఖ్యంగా ధోని లాంటి వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్ల నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌ రావడాన్ని బౌలర్‌ తప్పిదంగా చూడలేమని పొలార్డ్‌ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌ ఆదివారం చెన్నై జట్టుతో తలపడింది.

సొంతమైదానం వాంఖడేలో టాస్‌ గెలిచిన ముంబై సారథి హార్దిక్‌ పాండ్యా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. బౌలర్లు చెత్త ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

గెరాల్డ్‌ కొయెట్జీ(1/35), జస్‌ప్రీత్‌ బుమ్రా(0/27) కాస్త మెరుగైన ఎకానమీతో బౌలింగ్‌ చేయగా.. హార్దిక్‌ పాండ్యా(2/43), రొమారియో షెఫర్డ్‌(0/33). ఆకాశ్‌ మధ్వాల్‌ (0/37) మాత్రం చెత్తగా ఆడారు. 

సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌ వేసిన పాండ్యా బౌలింగ్‌లో ధనాధన్‌ ధోని హ్యాట్రిక్‌ సిక్సర్లతో దుమ్ములేపాడు. పాండ్యా సంధించిన బంతులను లాంగాఫ్‌, లాంగాన్‌, డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా సిక్సర్లుగా మలిచి.. మరో రెండు రన్స్‌ చేసి.. 20 పరుగులతో అజేయంగా నిలిచాడు.  
 
ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ముంబై 186 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. 

ఈ నేపథ్యంలో బౌలర్‌గా, బ్యాటర్‌(6 బంతుల్లో 2), కెప్టెన్‌గా విఫలమైన హార్దిక్‌ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అతడి బౌలింగ్‌లో ధోని సిక్సర్లు హైలైట్ కావడంతో.. ముంబై బ్యాటింగ్‌ కోచ్‌ కీరన్‌ పొలార్డ్‌ భిన్నంగా స్పందించాడు. 

‘‘అవును.. అతడు మూడు సిక్సర్లు కొట్టాడు. చివరి ఓవర్లో 20 పరుగులు తీశాడు. అయితే, ఆఖరి ఓవర్లో ఎవరైనా 20 పరుగులు సాధించగలరు కదా! అందులో వింతేముంది?

ఇక ఎంఎస్‌ చాలా ఏళ్లుగా వరల్డ్‌క్లాస్‌ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడటంలో ఆశ్చర్యం లేదు. అతడు మైదానంలో అడుగుపెట్టి షాట్లు బాదుతుంటే చూడటాన్ని మేము కూడా ఆస్వాదిస్తాం. 

అయితే, ఈరోజు ధోనిని పెవిలియన్‌కు చేర్చేందుకు మేము రచించిన వ్యూహాలు ఫలితాన్నివ్వలేదు. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం’’ అని కీరన్‌ పొలార్డ్‌ చెప్పుకొచ్చాడు. కాగా ముంబైపై సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్‌ ‘బేబీ మలింగ’ మతీశ పతిరణ(4/28)కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

చదవండి: #Hardik Pandya: అతడిదంతా నటన! ధోని సిక్సర్లు కొడుతుంటే అలా..

Advertisement
Advertisement