#MI: బుమ్రాను వద్దన్నారా?.. అందులో తప్పేముంది? | Hardik Made A Decision: Pollard Sharp Reply To Question On MI Skipper | Sakshi
Sakshi News home page

#MI: బుమ్రాను కాదని బరిలోకి దిగిన పాండ్యా.. అందులో తప్పేముంది?

Published Mon, Mar 25 2024 5:46 PM | Last Updated on Mon, Mar 25 2024 6:19 PM

Hardik Made A Decision: Pollard Sharp Reply To Question On MI Skipper - Sakshi

ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ (PC: BCCI/IPL)

‘‘జట్టుగా ముందుకు వెళ్లాలనుకున్నపుడు కొన్ని కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సి ఉంటుంది. గత రెండేళ్లుగా హార్దిక్‌ గుజరాత్‌ తరఫున బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభిస్తూనే ఉన్నాడు. ఇక్కడ కూడా అంతే.

కొత్త బంతిని అతడు బాగా స్వింగ్‌ చేయగలడు. ఇందులో కొత్తేమీ లేదు. న్యూ బాల్‌తో కలిగే ప్రయోజనాలను మేము అందిపుచ్చుకోవాలనుకున్నాం. హార్దిక్‌ ఈ నిర్ణయం తీసుకున్నపుడు నాకేమీ తప్పుగా అనిపించలేదు.

అందుకే అలాగే ముందుకు వెళ్లాం’’ అని ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ కీరన్‌ పొలార్డ్‌ అన్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా సరైన నిర్ణయాలే తీసుకున్నాడని సమర్థించాడు.

కాగా ఐపీఎల్‌-2024ను పరాజయంతో మొదలుపెట్టింది ముంబై ఇండియన్స్‌. అహ్మదాబాద్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో హార్దిక్‌ ఖాతాలో పరాజయం చేరింది.

ఈ నేపథ్యంలో గుజరాత్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి వరల్డ్‌క్లాస్‌ పేసర్‌ ఉండగా.. ఆల్‌రౌండర్‌ పాండ్యా బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించడమేమిటని మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆటగాళ్ల సేవలను సరిగ్గా వినియోగించుకుంటునే అనుకున్న ఫలితాలు రాబట్టవచ్చని పాండ్యాకు హితవు పలుకుతున్నారు. అదే విధంగా.. లక్ష్య ఛేదనలో భాగంగా హార్దిక్‌ పాండ్యా ఏడోస్థానంలో రావడాన్ని విమర్శిస్తున్నారు. 

ఈ విషయాలపై స్పందించిన ‍కోచ్‌ కీరన్‌ పొలార్డ్‌ పాండ్యాకు మద్దతుగా నిలిచాడు. కొత్త బంతితో హార్దిక్‌ బరిలోకి దిగడం సరైందేననన్న పొలార్డ్‌.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలన్నది హార్దిక్‌ ఒక్కడి నిర్ణయం కాదని తెలిపాడు. ‘‘ఏ డెసిషన్‌ అయినా కలిసే తీసుకుంటాం.

జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. టాపార్డర్‌ చివరి వరకు బ్యాటింగ్‌ చేస్తే బాగుంటుంది. అలా కాని పక్షంలో.. టాప్‌, మిడిలార్డర్‌ విఫలమైతే పవర్‌ హిట్టర్లను కాస్త ఆలస్యంగా పంపిస్తాం.

చాలాసార్లు టిమ్‌ డేవిడ్‌ మా మ్యాచ్‌ను ఫినిష్‌ చేయడం చూసే ఉంటారు. హార్దిక్‌ కూడా చాలా ఏళ్లుగా ఇదే పని చేస్తున్నాడు. ఆటలో ఇవన్నీ సహజం. ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. నిన్న మాత్రం మా వ్యూహాలు సత్ఫలితాలను ఇవ్వలేదంతే’’ అని పొలార్డ్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: #Hardik Pandya: నువ్వేమైనా ధోని అనుకున్నావా?.. నీకిది అవసరమా?: షమీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement