హార్దిక్ పాండ్యా (PC: IPL)
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా ఏదో ఇబ్బందితో బాధ పడుతున్నాడని.. అయినా ఆ విషయాన్ని మాత్రం బయటపెట్టడం లేదని అభిప్రాయపడ్డాడు.
కావాలనే తన సమస్య గురించి అతడు దాచిపెడుతున్నట్లు కనిపిస్తోందని సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024 సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన హార్దిక్ పాండ్యాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.
హేళనలు.. విమర్శల వర్షం
ఓవైపు రోహిత్ శర్మపై కెప్టెన్‌గా వేటుకు పాండ్యానే కారణమని ముంబై అభిమానులు అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేయగా.. మరోవైపు హ్యాట్రిక్ పరాజయాల కారణంగా పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు వరల్డ్‌క్లాస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను కాదని.. తొలి మ్యాచ్‌లో తానే బౌలింగ్ అటాక్ ఆరంభించడం కూడా పాండ్యాపై విమర్శలకు కారణమైంది.
అయితే, తర్వాత ఈ పేస్ ఆల్‌రౌండర్ పంథా మార్చాడు. బౌలింగ్ చేయడం కంటే బ్యాటింగ్ చేయడంపైనే ఎక్కువ దృష్టి సారించాడు. ఈ క్రమంలో వరుసగా రెండు విజయాలు అందుకుని విమర్శకులకు సమాధానం ఇచ్చాడు.
పాండ్యా తీరుపై అనుమానం
ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ కివీస్ మాజీ పేసర్ సైమన్ డౌల్ అనుమానం వ్యక్తం చేశాడు. ‘‘తొలి మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను వేసిన బౌలర్.. అకస్మాత్తుగా జట్టుకు తన సేవలు అవసరం లేదన్నట్లుగా వ్యవహరించడం ఆశ్చర్యంగా ఉంది.
అతడు గాయపడ్డాడు. ఏదో సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఆ విషయాన్ని బయటపెట్టడం లేదు. కచ్చితంగా ఏదో దాచిపెడుతున్నాడని నా మనసు బలంగా చెబుతోంది’’ అని సైమన్ డౌల్ క్రిక్‌బజ్ షోలో వ్యాఖ్యానించాడు.
అప్పుడు చీలమండకు గాయం
కాగా గుజరాత్ టైటాన్స్‌తో పదిహేడో ఎడిషన్ ఆరంభించిన ముంబై ఇండియన్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ.. సరైన సమయంలో మళ్లీ పూర్తి స్థాయిలో బంతితో బరిలోకి దిగుతానని చెప్పిన విషయం తెలిసిందే.
ముంబై జట్టులో కావాల్సినంత మంది పేసర్లు ఉన్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే, సైమన్ డౌల్ మాత్రం అతడి వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా పాండ్యా చీలమండకు గాయం కాగా.. కోలుకున్న అనంతరం ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.
చదవండి: గైక్వాడ్ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్‌లో CSK కెప్టెన్ అతడే!
Comments
Please login to add a commentAdd a comment