IPL 2024: హార్దిక్‌ పాండ్యా పోస్ట్‌ వైరల్‌! నెటిజన్లు ఫైర్‌ | We Never Give Up: Hardik Message to Fans After Frosty Wankhede Reception | Sakshi
Sakshi News home page

IPL 2024: వరుస ఓటములు.. హార్దిక్‌ పోస్ట్‌ వైరల్‌! ఏకిపారేస్తున్న నెటిజన్లు

Published Tue, Apr 2 2024 5:53 PM | Last Updated on Tue, Apr 2 2024 6:21 PM

We Never Give Up: Hardik Message to Fans After Frosty Wankhede Reception - Sakshi

ముంబై ఇండియన్స్‌ (PC: BCCI)

ఐపీఎల్‌ 2014.. ముంబై ఇండియన్స్‌ ఆడిన తొలి ఐదు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. ఆ తర్వాత తిరిగి పుంజుకుని టాప్‌-4లో నిలిచి ప్లే ఆఫ్స్‌ చేరింది.. ఆ మరుసటి ఏడాది అంటే 2015లో.. మొదటి నాలుగు మ్యాచ్‌లోనూ పరాజయమే పలకరించింది.

కానీ ఆ తర్వాత అనూహ్య రీతిలో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఆ ఏడాది ఫైనల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి ఏకంగా చాంపియన్‌గా అవతరించింది.

అదే విధంగా.. 2018లోనూ ఇదే తరహాలో తొలి మూడు మ్యాచ్‌లలో ఓటమే ఎదురైంది. అయితే, తమకు ఇదేమీ కొత్త కాదన్నట్లు ఆఖరి వరకు పోరాడింది. ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకోలేకపోయినా ఐదో స్థానం సాధించగలిగింది.

ఇక తాజా ఎడిషన్‌ను కూడా ఓటమితోనే మొదలుపెట్టింది ముంబై ఇండియన్స్‌. తొలుత గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో పరాభవం చెందిన హార్దిక్‌ సేన.. అనంతరం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది.

ఈ నేపథ్యంలో విమర్శకుల వేళ్లన్నీ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యావైపే చూపిస్తున్నాయి. ముఖ్యంగా జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌ సేవలను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం సహా ఇలాంటి మరిన్ని అనాలోచిత నిర్ణయాల ఫలితమే హ్యాట్రిక్‌ పరాజయాలకు కారణమని అభిమానులు సైతం మండిపడుతున్నారు.

ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ‘‘ఈ జట్టు గురించి ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మేము ఎప్పటికీ నిరాశ చెందము. పోరాడుతూనే ఉంటాం.. ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాం’’ అని పాండ్యా ఎక్స్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్ల ఫొటోను పంచుకున్నాడు. 

మిలియన్‌కు పైగా వ్యూస్‌ సంపాదించిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘అప్పుడు కెప్టెన్‌గా ఉన్నది రోహిత్‌ శర్మ.. అందుకే గతంలో ఇలా జరిగినా జట్టు తిరిగి కోలుకుని విజయాల బాట పట్టింది.

రోహిత్‌ ఎంఐని ఒక్కటిగా ఉంచాడు. కానీ నువ్వు.. సీనియర్లు అన్న గౌరవం లేకుండా.. కనీస మర్యాద పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నావు. కోచ్‌లతో కూడా సయోధ్య ఉన్నట్లు కనిపించడం లేదు.

ఇక జట్టును ఎలా ఒక్కటిగా ఉంచగలవు? విజయాలెలా సాధించగలవు?’’ అని ఏకిపారేస్తున్నారు. కాగా ముంబై ఇండియన్స్‌ తదుపరి సొంత మైదానం వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఇరుజట్ల మధ్య ఆదివారం(ఏప్రిల్‌ 7) మ్యాచ్‌ జరుగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement