నువ్వేమైనా ధోనివా?.. నీకిది అవసరమా హార్దిక్‌?: షమీ | 'You Can't Match Dhoni': Shami Blasts Hardik Pandya's MI Tactic vs GT - Sakshi
Sakshi News home page

#Hardik Pandya: నువ్వేమైనా ధోని అనుకున్నావా?.. నీకిది అవసరమా?: షమీ

Published Mon, Mar 25 2024 4:39 PM | Last Updated on Mon, Mar 25 2024 5:24 PM

IPL 2024 You Cant Match Dhoni: Shami Blasts Hardik Pandya MI Tactic vs GT - Sakshi

హార్దిక్‌ పాండ్యా (PC: MI/BCCI)

ముంబై ఇండియన్స్‌ కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఐపీఎల్‌-2024లో గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అతడు అనుసరించిన వ్యూహాలపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి మేటి బౌలర్‌ సేవలను సరైన సమయంలో వినియోగించుకోలేదని విమర్శిస్తున్నారు. అదే విధంగా.. హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఏడోస్థానంలో రావడాన్ని కూడా తప్పుబడుతున్నారు.

ఈ క్రమంలో టీమిండియా సీనియర్‌ పేసర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ స్పందిస్తూ.. హార్దిక్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రిక్‌బజ్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘ధోని ఎల్లప్పుడూ ధోనినే. 

అతడిని ఎవరూ మ్యాచ్‌ చేయలేరు. ధోని అయినా.. కోహ్లి అయినా.. ప్రతి ఒక్క ఆటగాడి మైండ్‌సెట్‌ వేరుగా ఉంటుంది. మన నైపుణ్యాలు, ఆటకు తగినట్లు ప్రవర్తించాల్సి ఉంటుంది. 

నువ్వు గత రెండు సీజన్లుగా మూడు లేదంటే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తున్నావు. ఆ పొజిషన్‌లో ఆడటానికి అలవాటు పడ్డావు. ఒక్కోసారి ఐదో స్థానంలో కూడా బ్యాటింగ్‌ చేయవచ్చు. కానీ.. ఏడో నంబర్‌లో మాత్రం కాదు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. హార్దిక్‌ పాండ్యా.. ధోనిలా ఏడో స్థానంలో వచ్చి గొప్ప ఫినిషర్‌ అవలేడని షమీ అభిప్రాయపడ్డాడు.

కాగా ఐపీఎల్‌-2022లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్‌ పాండ్యా అరంగేట్రంలోనే టైటిల్‌ అందించాడు. గతేడాది రన్నరప్‌గా నిలిపాడు. అయితే, ఐపీఎల్‌-2024 ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌ గూటికి చేరుకుని అనూహ్య రీతిలో రోహిత్‌ శర్మ స్థానంలో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

ఈ క్రమంలో గుజరాత్‌తో అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో ముంబై ఓడటంతో పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. సీజన్‌ ఆరంభంలోనే పరాజయం అతడిని పలకరించింది. 

ఇక ఈ మ్యాచ్‌లో పాండ్యా ఏడో స్థానంలో వచ్చి 4 బంతుల్లో 11 పరుగులు చేశాడు. అంతకుముందు 3 ఓవర్లు బౌల్‌ చేసి 30 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే.. గత రెండు సీజన్లలో పాండ్యా సారథ్యంలో గుజరాత్‌కు ఆడిన మహ్మద్‌ షమీ గాయం కారణంగా తాజా ఎడిషన్‌కు దూరమైన విషయం తెలిసిందే.

చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్‌.. మండిపడ్డ రోహిత్‌! పక్కనే అంబానీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement