మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌లో హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది. గురువారం పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కింగ్స్ విసిరిన 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో సన్‌రైజర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమై పరాజయం చవిచూసింది. హైదరాబాద్ ఆటగాళ్లలో కేన్ విలియమ‍్సన్(54), మనీష్ పాండే(57 నాటౌట్), షకిబుల్ హసన్(24 నాటౌట్) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు.
లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఎదుర్కొన్న తొలి బంతికి శిఖర్ ధావన్ గాయపడటంతో రిటైర్డ్‌హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వృద్ధిమాన్ సాహా(6) తొలి వికెట్‌గా ఔట్ కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత యూసఫ్ పఠాన్(19) సైతం నిరాశపరిచాడు. ఆ తరుణంలో విలియమ‍్సన్-మనీష్ పాండే జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకుంది. వీరిద్దరూ 76 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత విలియమ‍్సన్ ఔటయ్యాడు.
అంతకుముందు కింగ్స్ పంజాబ్ 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. క్రిస్ గేల్ మరోసారి వీరోచిత ఇన్నింగ్స్ ఆడటంతో కింగ్స్ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కింగ్స్‌కు ఓపెనర్లు క్రిస్ గేల్, కేఎల్ రాహుల్‌లు శుభారంభం అందించారు. వీరిద్దరూ కుదురుగా ఆడుతూ జట్టు స్కోరును ఎనిమిదో ఓవర్‌లో యాభై పరుగులు దాటించారు. అయితే జట్టు స్కోరు 53 పరుగుల వద్ద రాహుల్(18) వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆపై కాసేపటికి మయాంక్ అగర్వాల్ కూడా ఔట్ కావడంతో పంజాబ్ 83 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. కాగా, అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న గేల్ చెలరేగి పోయాడు. ప్రధానంగా కింగ్స్ ఇన్నింగ్స్‌లో భాగంగా 10 ఓవర్ దాటిన తర్వాత గేల్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు.
కేవలం సిక్సర్లపైనే దృష్టి పెట్టిన గేల్ విధ్వంసకర ఆటతో మైమరిపించాడు. కేవలం 1 ఫోర్ మాత్రమే సాధించిన గేల్.. సిక్సర్ల మోత మోగించాడు. ఏకంగా 11 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. సన్‌రైజర్స్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి తన బ్యాటింగ్ పవర్‌ను చూపెట్టాడు. ఫలితంగా 63 బంతుల్లో గేల్ అజేయంగా 104 పరుగులు సాధించాడు. ఇది ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి శతకంగా లిఖించబడింది. అతనికి జతగా కరుణ్ నాయర్(31; 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), అరోన్ ఫించ్(14 నాటౌట్, 6 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) సమయోచితంగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 193 పరుగులు సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్, సిద్ధార్ధ్ కౌల్, భువనేశ్వర్ కుమార్‌లకు మాత్రమే తలో వికెట్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment